- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోళ్ల ఫారంలో కెమికల్ ల్యాబ్.. కల్తీ కల్లు మాఫియా గుట్టురట్టు చేసిన 'ఈగల్ ఫోర్స్'!
కల్లు కల్తీ కోసం కోళ్ల ఫారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ ఆల్ఫ్రాజోలం మత్తుమందు తయారీ కేంద్రంపై తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగం ‘ఈగల్ ఫోర్స్’ మెరుపు దాడి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కల్లు కల్తీ కోసం కోళ్ల ఫారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ ఆల్ఫ్రాజోలం మత్తుమందు తయారీ కేంద్రంపై తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగం ‘ఈగల్ ఫోర్స్’ మెరుపు దాడి చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ వద్ద ఆదివారం జరిగిన ఈ దాడిలో రూ. 20.30 లక్షల విలువైన 1.150 కిలోల ఆల్ఫ్రాజోలంతో పాటు తయారీకి ఉపయోగించే రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారితో సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. ఈగల్ ఫోర్స్ అధికారుల సమాచారం మేరకు.. అన్నసాగర్ గ్రామ శివారులోని లక్ష్మీనరసింహ పౌల్ట్రీ ఫారంలో మత్తుమందు తయారీ సాగుతోందన్న పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. పౌల్ట్రీ ఫారంలో లోపల రహస్యంగా ల్యాబ్ ఏర్పాటు చేసి అల్ప్రాజోలమ్‌ను తయారు చేస్తూ.. స్థానిక కల్లు డీలర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ అక్రమ సిండికేట్‌కు మహబూబ్‌నగర్ మూసాపేటకు చెందిన మలేల జయప్రకాష్ గౌడ్ (39) ప్రధాన సూత్రధారి. పాత నేరస్థుడైన ఇతడు, గతంలో బోయిన్‌పల్లిలో ఇదే తరహా ల్యాబ్ నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ ఏడాది మార్చిలో జైలు నుంచి విడుదలై, కోర్టు నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ తన ముఠాను క్రియాశీలం చేశాడు. గత కేసులో పరారీలో ఉన్న వికారాబాద్ జిల్లాకు చెందిన చెదురుపల్లి కృష్ణయ్య గౌడ్ (50)తో కలిసి ఈ కొత్త ల్యాబ్‌ను ఏర్పాటు చేశాడు. ఈగల్ ఫోర్స్ జరిపిన తాజా దాడుల్లో జయప్రకాష్, కృష్ణయ్యలతో పాటు తయారీకి సహకరించిన గడ్డగిడి బాల ఆంజనేయులు (51), ల్యాబ్‌కు ఆశ్రయం కల్పించిన పౌల్ట్రీ ఫారం యజమాని బోయ నరసింహులు (58)లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు.. ముడి రసాయనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కల్లు కల్తీ కోసం దీనిని కొనుగోలు చేస్తున్న స్థానిక డీలర్లు ఎవరు? తదితర కోణాల్లో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. సిండికేట్‌తో సంబంధమున్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.






