- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ నినో ఎఫెక్ట్: ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ
రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా మరోసారి ప్రజా పంపిణీ వ్యవస్థ లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

- ఎల్‌నినో ప్రభావంతో కేంద్రం ముందు జాగ్రత్తలు
- ఈకేవైసీ పూర్తి చేసిన వారికే సన్నబియ్యం అందజేత
- ఈనెల 31వ తేదీలోగా చేయించుకునేందుకు గడువు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా మరోసారి ప్రజా పంపిణీ వ్యవస్థ లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన సన్నబియ్యం ఒకేసారి అందించనున్నారు. ఈ మేరకు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయటంతో ఆగస్టు 1 నుంచి మూడు నెలల బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు వేగం చేస్తోంది. సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనుండటంతో ఆగస్టులో 31 రోజులు దుకాణాలు తెరచి బియ్యం అందించాల్సి ఉంది. ప్రతి రేషన్ కార్డుదారు మూడు సార్లు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. ఎంఎల్ఎస్పాయింట్ల నుంచి రేషన్‌దుకాణాలకు రెండు, మూడుసార్లు సరిపడ రవాణా చేయనున్నారు. చిన్న దుకాణాలకు ఒకేసారి, పెద్ద దుకాణాలకు రెండు సార్లు రవాణా జరుగుతుంది. గత ఏప్రిల్, మే, జూన్‌నెలలకు సంబంధించిన రేషన్‌కూడా ఒకేసారి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కార్డుల ద్వారా 3.20 కోట్ల లబ్దిదారులకు 2.15 లక్షల మెట్రిక్‌టన్నులు బియ్యం పంపిణీ చేయనుంది. అందులో పుడ్‌సెక్యూరిటీ కార్డులోని ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పన, అంత్యోదయ కార్డు కలిగిన వారికి 35 కిలోలు, కిలో చక్కెర, అన్నపూర్ణ కార్డు ఉన్న వారికి 10 కిలోల సన్నబియ్యంతో పాటు 5 కిలోల గోదుమలు పంపిణీ చేస్తారు. లబ్ధిదారులు రేషన్ పొందేందుకు ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే బియ్యం సరఫరా చేస్తారు.ఈ కేవైసీ నమోదైన వారికి మాత్రమే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా అయ్యేలా జాతీయ సమాచార వ్యవస్థ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తుంది. తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులో పేరు ఎక్కిన వారు చాలా మంది ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు. ఈ నెల 31 వరకు ఈ కేవైసీ చేయించుకోవడానికి గడువు ఉంది.
మూడు రేషన్ పంపిణీ డీలర్లకు సమస్యలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రేషన్ డీలర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకేసారి మూడు నెలలకు సరిపడా స్టాక్‌ను అందుబాటులో ఉంచుకునేందుకు రేషన్ దుకాణాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకేసారి వందల క్వింటాళ్ల బియ్యాన్ని తమ వద్ద ఉంచుకునేంత పరిస్థితి లేకపోవడంతో డిమాండ్‌కు తగ్గట్లు రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా ఈ-పాస్యంత్రాల్లో సాంకేతిక లోపాలు, వేర్వేరుగా బయోమెట్రిక్ తీసుకోవడం పంపిణీలో జాప్యం జరగనుంది. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో బియ్యం పంపిణీ చేయడంతో తూకం వేయడంలో డీలర్లకు ఇబ్బందులు ఎదురైతాయి. ప్రతి నెలా అవసరమైన దానికంటే మూడింతల ఎక్కువ బియ్యం ఒకేసారి తరలించడం, వాటిని లబ్ధిదారులకు అందించడం డీలర్లకు శ్రమతో కూడుకున్న పనిగా మారింది. దీంతో డీలర్ ఒక కార్డుదారుడికి రేషన్ ఇవ్వడానికి 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సాఫ్ట్ వేర్ సమస్యను పరిష్కరించడంతో పాటు బ్లూ టూత్ మిషన్ విషయంలో సడలింపు ఇవ్వాలని, ఒక కుటుంబానికి చెందిన బియ్యం ఒకేసారి పంపిణీ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని డీలర్లు కోరుతున్నారు. ఈ-పాస్, ఎలక్ట్రానిక్ కాంటాక్టు బ్లూటూత్ లింక్ తొలగిస్తే పంపిణీ సులభమవుతుందని సూచిస్తున్నారు.
ఈ-కేవైసీకి సొంతూరు వెళ్లాల్సిన పనిలేదు
రేషన్‌కార్డు లబ్ధిదారులు ప్రస్తుతం ఈ-కేవైసీ అప్‌డేట్ కోసం తమ పరిధిలోని రేషన్ షాప్ నుంచే కాకుండా దేశంలో ఎక్కడైనా ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారు ఈ-కేవైసీ చేసుకునేందుకు హడావుడిగా సొంతూర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర గత రెండేళ్ల నుంచి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రచారం చేసిన 40 శాతం మంది ఇప్పటివరకు చేయించుకోలేదు. గ్రామస్థాయిలో ఈ-కేవైసీ ప్రక్రియపై పూర్తిస్థాయిలో ప్రచారం కల్పించి, వలస వెళ్లిన వారికి మొబైల్ ఫోన్ ద్వారా ఈ-కేవైసీపై సమాచారం అందిస్తే వందశాతం పూర్తి అవుతుంది.






