- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కార్ మరో కీలక నిర్ణయం.. త్వరలో ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్స్
రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థ బలోపేతంతో పాటు, సమాజ నిర్మాణానికి దోహదపడే సంస్కరణాత్మక చర్యల దిశగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థ బలోపేతంతో పాటు, సమాజ నిర్మాణానికి దోహదపడే సంస్కరణాత్మక చర్యల దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు, విడాకులు, కుటుంబ కలహాల నేపథ్యంలో యువ దంపతులకు మార్గదర్శనం చేసేందుకు వివాహ పూర్వ కౌన్సెలింగ్ కేంద్రాలు (ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్స్-పీఎంసీసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం ఈ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఇది సమాజ నిర్మాణానికి, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి దోహదపడే సంస్కరణాత్మక చర్య అని ఆమె పేర్కొన్నారు.
ప్రతి జిల్లాకు ఒక కేంద్రం..
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఒక్కో కేంద్రం చొప్పున మొత్తం 33 పీఎంసీసీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభంలో వీటిని సఖీ లేదా వన్ స్టాప్ సెంటర్లలో ఏర్పాటు చేసి, అవసరాన్ని బట్టి సొంత భవనాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి కేంద్రంలో ఒక లీగల్ కౌన్సిలర్, సైకాలజిస్టు, సోషల్ వర్కర్, ఒక హెల్పర్‌ను నియమించనున్నారు. వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టే యువజంటలకు పరస్పర అవగాహన, వివాద పరిష్కారం, భావోద్వేగ అనుకూలత, చట్టపరమైన హక్కులు, లింగ స్పందన, కుటుంబ బాధ్యతలపై శిక్షణ, అవగాహన కల్పిస్తారు. సిబ్బందికి నెలకు రూ.30 వేల వేతనం చెల్లించనున్నారు. సిబ్బంది జీతాలు, నిర్వాహణ కోసం ఏడాదికి సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
పెరుగుతున్న ఫిర్యాదులు..
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, సఖీ కేంద్రాలకు ఇటీవల వివాహ సంబంధ ఫిర్యాదులు పెరిగాయి. పరస్పర అవగాహన లోపం, తల్లిదండ్రుల జోక్యం, చిన్న కుటుంబాల పెరుగుదల, తరాల మధ్య బంధం తగ్గడం వంటి కారణాల వలన వివాహ బంధంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారంగానే ఈ కౌన్సెలింగ్ కేంద్రాల అవసరం ఏర్పడిందని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సంతకం చేసిన ఈ ఫైల్‌కు త్వరలో ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే రాష్ట్రంలో పీఎంసీసీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది.
Read More..
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. భార్యాభర్తల మధ్య తగ్గనున్న గొడవలు, విడాకులు






