సంక్షేమం-అభివృద్ధికి సమ ప్రాధాన్యం.. ప్రజల ఆశల్ని నెరవేర్చాం : సీఎం రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-02 05:06:18  IST  )

అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

సంక్షేమం-అభివృద్ధికి సమ ప్రాధాన్యం.. ప్రజల ఆశల్ని నెరవేర్చాం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం మాట్లాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం మొదలు పెట్టిన సీఎం.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల సక్సెస్ గురించి వివరించారు. తెలంగాణ కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కృషి చేసిన సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పుట్టుకనీది, చావునీది.. బతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలను గుర్తు చేసుకున్నారు. కాళోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టిన నాటి నుంచీ రాష్ట్ర హితం కోసమే శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని, ఎవరికి పట్టం కట్టాలో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. ప్రభుత్వమంటే నలుగురి చేతిలో పెత్తనం కాదన్నారు.

ఇకపై కొలువుల జాతర

రాష్ట్రంలో ఇప్పటికే 1362 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతుల్ని ప్రారంభించామని, అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో బ్రేక్ ఫాస్ట్ ను అందిస్తున్నామని, జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అమలు చేశామని గుర్తుచేశారు. ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతూ.. న్యాయపరమైన సమస్యలు లేకుండా భర్తీ చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఇప్పటివరకూ అత్యంత పారదర్శకంగా 67 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని, ఈ నెలలోనే TGPSC ద్వారా మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని వెల్లడించారు. ఇంజినీరింగ్, పీసీబీ, అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు. టౌన్ ప్లానింగ్, విద్యాశాఖలోనూ ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని, ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం వెల్లడించారు.

రైతే రాజు.. పారిశ్రామిక వేత్తల్ని చేయడమే లక్ష్యం

30 నెలల పాలనలో ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించామన్నారు. 2047 విధానపత్రంలో రైతులకు ప్రాధాన్యమిచ్చామని, రాష్ట్రంలో రైతుల్ని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రైతులకు ఒక్కొక్కరికి ఇప్పటి వరకూ రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. రూ.20,616 కోట్లు రైతుల ఖాతాల్లో వేసి, దాదాపు 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశామని వివరించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తూనే, విద్యుత్తు పంప్ సెట్లకు సౌరశక్తితో నడిచే పంప్ సెట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు రూ. 27 వేల 529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశామని, గత ఏడాది వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సహాయ పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.8 వేల 744 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అలాగే.. ఈ ఏడాది ఇప్పటికే 5 వేల 700 కోట్ల రూపాయల రైతుభరోసా నిధులను నేరుగా రైతు ఖాతాలలో జమచేశామని, ఇది అన్నదాతల పట్ల మా చిత్తశుద్ధికి, వ్యవసాయం పట్ల మా ప్రాధాన్యతకు నిదర్శనం.2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు.

మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం..

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఆడబిడ్డల్ని పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ.లక్షకోట్ల రుణాలిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్ర మహిళలు దేశానికే ఆదర్శంగా మారారని, ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను అందజేశామని చెప్పారు. ఉచిత బస్సు పథకంతో ఇప్పటి వరకూ మహిళలు రూ.10 వేల కోట్ల విలువైన ప్రయాణాలు చేశారని సీఎం చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర బీజేపీదే.. ఆవిర్భావ వేడుకల్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Next Story