మొన్న డాక్టర్ కోడలు.. ఇప్పుడు టీచర్ కూతురు.. రెచ్చిపోతున్న 'బాల్ కతర్వా' గ్యాంగ్

by Prasad Jukanti |

ఇళ్లలోకి చొరబడి దొంగతనంతో పాటు మహిళల జుట్టు కత్తిరిస్తున్న 'బాల్ కతర్వా' ముఠా కలకలం రేపుతోంది.

మొన్న డాక్టర్ కోడలు.. ఇప్పుడు టీచర్ కూతురు..  రెచ్చిపోతున్న బాల్ కతర్వా గ్యాంగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దొంగలన్నాక డబ్బు, నగలు దోచుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ ముఠా దొంగతనాలతో పాటు వింత చేష్టలు అక్కడి మహిళలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. చోరీలకు పాల్పడటమే కాకుండా ఇంట్లోని మహిళలు, బాలికల జుట్టు కత్తిరించి పారిపోతుండటంత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. బిహార్‍లోని దర్భాంగా జిల్లా బహదూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరహార్ గ్రామంలో ఈ తరహా చోరీలు వరుసగా వెలుగు చూడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఈ గ్రామంలో 'బాల్ కతర్వా' (జుట్టు కత్తిరించే) ముఠా రెచ్చిపోయింది.

మొన్న డాక్టర్ కోడలు, ఇప్పుడు టీచర్ కూతురు:

8 రోజుల క్రితం గ్రామానికి చెందిన డాక్టర్ పవన్ కుమార్ మిశ్రా ఇంట్లోకి చొరబడిన బాల్ కతర్వా ముఠా డాక్టర్ కోడలికి బలవంతంగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆపై రూ.లక్షల విలువ చేసే నగలు దోచుకున్నారు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఆమె జుట్టును కత్తిరించారు. జుట్టు కత్తింరించి వెళ్లడం అక్కడి వారినందరిని షాక్ కు గురి చేసింది. అయితే ఈ షాక్ నుంచి బయటకు రాకముందే తాజాగా మరోసారి అదే గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఈసారి గ్రామానికి చెందిన ఉపాధ్యాయ దంపతులు సుమన్ కుమార్, కుమారి భారతి ఇల్లే లక్ష్యం చేసుకున్నారు. రాత్రి పూట ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లో బీరువాలో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు. అలాగే ఉపాధ్యాయుడి కూతురు తల జుట్టును కత్తెరతో కత్తిరించి అక్కడే పారేసి వెళ్లిపోయారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలో గ్రామస్తులు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. మొదటి ఘటన జరిగి వారం దాటినా పోలీసులు నిందితులను పట్టుకోకపోవడం వల్లే ఈ ముఠా రెచ్చిపోయిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్స్:

వరుసగా రెండోసారి ఇలాంటి వింత ఉదంతం జరగడంతో బహదూర్‌పూర్ పోలీసులు, ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL), టెక్నికల్ సెల్ బృందాలు రంగంలోకి దిగి క్లూస్ సేకరించాయి. రెండు కేసుల్లోనూ ఒకే రకమైన పద్ధతి కనిపిస్తోందని, దీని వెనుక ఒకే ముఠా హస్తం ఉండవచ్చని బహదూర్‌పూర్ థానాధ్యక్షుడు ప్రసూన్‌జయ్ కుమార్ తెలిపారు. నిందితుల వెనుక ఏదైనా మూఢనమ్మకం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ వింత గ్యాంగ్‌ను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Next Story