- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి వాకిటి శ్రీహరి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల ప్రత్యేక పూజలు
మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థత నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, మక్తల్: మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థత నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులుగా వైరల్ ఫీవర్, స్టమక్ ఇన్‌ఫెక్షన్‌తో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన మంత్రిని కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం కుదుటపడాలని కాంక్షిస్తూ నియోజకవర్గంలోని మక్తల్, కృష్ణ, మాగనూరు, ఉట్కూర్, నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండల కేంద్రాల్లోని ప్రముఖ పురాతన ఆలయాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు. ముఖ్యంగా మక్తల్ పట్టణంలో మంత్రి కులదైవమైన అతి పురాతన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పట్టణ అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించారని కొనియాడారు. రహదారులు, విద్య, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా పుంజుకున్నాయన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే తమ నాయకుడు త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజల ముందుకు రావాలని వారు ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ మానస, స్థానిక కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు, ఏఎంసీ (మార్కెట్ కమిటీ) సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






