లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మంది మృతి

by Malleboina Mahesh |

పెరు దేశంలోని ఆండీస్ పర్వత ప్రాంతంలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి లోయలోకి బస్సు పడిపోవడంతో 13 మంది మృతి, పది మందికి పైగా తీవ్ర గాయాలు!

లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర షాకింగ్ ఘటన దక్షిణ అమెరికా దేశమైన పెరు (Peru) లో సంభవించింది. ఆండీస్ పర్వత ప్రాంతంలో గల అయాకుచో (Ayacucho) డిపార్ట్‌మెంట్‌ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తోన్న ఒక ప్యాసింజర్ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కొండపై నుంచి కిందకు పడిపోయింది. ఈ భయానక ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఘటనా స్థలంలో బస్సు శకలాలు చెల్లాచెదురుగా పడిపోగా.. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఆరోగ్య శాఖ బృందాలు అక్కడికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరో 10 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పెరు దేశంలోని ఆండీస్ పర్వత ప్రాంత రహదారులు అత్యంత ప్రమాదకరమైన మలుపులతో ఉంటాయని, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంతో పాటు రహదారి సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానిక అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story