- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టుకు పవన్ కల్యాణ్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకోనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయి. కొండగట్టు ఆంజనేయస్వామి వారిని పవన్ కల్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
టీటీడీ సహకారం
టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు. పవన్ కల్యాణ్ ఈ విషయమై టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుతో చర్చించారు. టీటీడీ బోర్డు రూ.35.19 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి, బి.మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సీ. చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొననున్నారు.
జనసేన కార్యకర్తలతో సమావేశం
ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు ఆర్.కె.సాగర్, రాజలింగం, దామోదర్ రెడ్డి, ఎం. కావ్య, పి. శిరీష తదితరులు పాల్గొంటారు.
READ MORE .....






