- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాట నిలబెట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
కొండగట్టు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్న పవన్ కళ్యాణ్ గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి/కొండగట్టు: కొండగట్టు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్న పవన్ కళ్యాణ్ గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు. కొండగట్టు అభివృద్ధికి టిటిడి బోర్డు అధికారులతో చర్చించిన పవన్ కళ్యాణ్ రూ 35.19కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేయించారు. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం స్వయంగా ఆయనే శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది.
రూ.35 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
పవన్ కళ్యాణ్ ఉదయం 9.25 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.25 గంటలకు కొండగట్టు జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం 10.30 గంటలకు స్వామివారిని దర్శించుకుని, టిటిడి నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భక్తుల వసతికై 96 గదుల నిర్మాణం, ఒకేసారి రెండు వేల మంది దీక్ష విరమణ చేసుకునేలా మాల విరమణ మండప నిర్మాణ పనులు ఉన్నాయి. మొత్తం రూ.35 కోట్లకు పైగా టిటిడి నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు.టిటిడి సహకారంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి, బి.మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సీ. చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొననున్నారు.
కొండగట్టు అంజన్నపై అపార నమ్మకం..
కొండగట్టు ఆంజనేయస్వామిపై పవన్ కళ్యాణ్‌కు అపారమైన నమ్మకం ఉన్న విషయం తెలిసిందే. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సమయంలో, అలాగే జనసేన పార్టీ స్థాపన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. ఒకసారి దర్శనానంతరం విద్యుత్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే తనకు పునర్జన్మ లభించిందని పలుమార్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’కి కూడా ఇక్కడే తొలి పూజ చేయించగా, ఆలయ అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు టిటిడి ద్వారా రూ.35 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆ నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయడమే కాక అధికారంలోకి వచ్చి ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టు కు రావడం ప్రత్యేకతగా నిలిచింది.
రిసార్ట్‌లో కార్యకర్తలతో సమావేశం..
ఆంజనేయ స్వామి దర్శన కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ 11.30 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని ఓ రిసార్ట్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ నాయకులతో పవన్ చర్చించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేయగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు శుక్రవారం హెలిప్యాడ్ సహా టెంపుల్ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
READ MORE .....






