‘ఆపరేషన్ కగార్’ మాకు చాలా చిన్న విషయం.. మాజీ మావోయిస్టు నేత దేవ్‌ జీ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-13 07:17:19  IST  )

మావోయిస్టు పార్టీ నిర్వీర్యం కావడానికి ‘ఆపరేషన్ కగార్’ కంటే పార్టీ తీసుకున్న తప్పుడు రాజకీయ నిర్ణయాలే ప్రధాన కారణమని మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఆపరేషన్ కగార్’ మాకు చాలా చిన్న విషయం.. మాజీ మావోయిస్టు నేత దేవ్‌ జీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ఎంతవరకు పనిచేసింది? పార్టీ నిర్వీర్యం కావడానికి అసలు కారణాలేంటి? అనే ప్రశ్నలు అందరినీ తొలిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్ర నేతలు, పార్టీ సభ్యులు లొంగిపోవడానికి గల కారణాలపై ఆ పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కీలక సమయాల్లో తప్పుడు నిర్ణయాలు..

ఇవాళ ఆయన ఓ ప్రముఖ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. తాము పోలీసుల ఎదుట లొంగిపోలేదని స్పష్టం చేశారు. తాము మొదటి నుంచీ జనజీవన స్రవంతిలోనే ఉన్నామని, పార్టీ అత్యంత కీలక సమయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మరోవైపు మావోయిస్టు పార్టీని విస్తరించడంలో తాము విఫలమయ్యామని ఆయన అంగీకరించారు.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా ‘ఆపరేషన్ కగార్’..

‘ఆపరేషన్ కగార్’ తమకు చాలా చిన్న విషయమని దేవ్ జీ పేర్కొన్నారు. పార్టీలో లక్షలాది మంది ప్రజలతో కలిసి పట్టణాల్లో, మైదానాల్లో, అడవుల్లో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించినట్లయితే.. అంతటి ప్రజా పునాది కలిగిన మావోయిస్టు పార్టీని ఏ ‘ఆపరేషన్ కగార్’ కూడా ఏమీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడమే పార్టీకి నష్టం కలిగించిందని, ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం లేకుండా కేంద్ర బలగాలు తమపై ఎడతెరిపి లేకుండా దాడులు చేశాయని తెలిపారు. మావోయిస్టు పార్టీ తన వైఫల్యాలను సమీక్షించుకునే లోపే ప్రభుత్వం ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ లాగా ఈ ఆపరేషన్ చేపట్టిందని ఆయన అన్నారు.

రాజకీయ నినాదం లేకపోవడమే దెబ్బ..

ఒక్కో పార్టీ కార్యకర్త లేదా గెరిల్లా వెనుక 100 నుండి 200 మంది బలగాలను మోహరించి, మూడు-నాలుగు అంచెలుగా సైనిక దాడి జరిపారని వివరించారు. ఒక చిన్న గెరిల్లా దళాన్ని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా 8.5 లక్షలకు పైగా పోలీసు, పారా మిలటరీ, వివిధ రకాల కమాండో దళాలతో పాటు భారత సైన్యం, వాయుసేనను కూడా రంగంలోకి దించి కేంద్రం యుద్ధం చేసిందని పేర్కొన్నారు. తమ లొంగుబాటుకు ఇవన్నీ సెంకడరీ కారణాలైతే.. రాజకీయంగా ఒక బలమైన నినాదాన్ని తీసుకుని ప్రజల ముందుకు వెళ్లకపోవడమే ప్రధాన పొరపాటని ఆయన విశ్లేషించారు. గెరిల్లా ఎత్తుగడలు అజేయమైనవని, కానీ వాటిని సరైన విధంగా ఆచరించకపోవడం వల్లే పార్టీ నిర్వీర్యమైందని దేవ్ జీ వెల్లడించారు.

సోనూ, దేవ్‌జీ వర్గాల కలయికపై ఉత్కంఠ.. మాజీ మావోయిస్టుల అడుగులు ఎటువైపు?

Next Story