నిరుద్యోగులపై బీఆర్ఎస్‌ది కపట ప్రేమ.. వారి ట్రాప్‌లో పడొద్దు: బల్మూర్ వెంకట్

by Ramesh Naini |

నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, పదేళ్ల మీ రాక్షస పాలనలో, నిరుద్యోగుల ఉసురుపోసుకున్నది మీరే అని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు.

నిరుద్యోగులపై బీఆర్ఎస్‌ది కపట ప్రేమ.. వారి ట్రాప్‌లో పడొద్దు: బల్మూర్ వెంకట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, పదేళ్ల మీ రాక్షస పాలనలో, నిరుద్యోగుల ఉసురుపోసుకున్నది మీరే అని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు పాతర-ప్రజా పాలనలో కొలువుల జాతర పేరిట ఫోటో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ లో 16 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను మీరు ఏనాడు పరామర్శించలేదు, పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. వాళ్ల రాజకీయ స్వార్థం కోసం, నిరుద్యోగులపై బీఆర్ఎస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని, నిరుద్యోగులు బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దని బల్మూర్ వెంకట్ సూచించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 80 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది, మరో 30 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. తాను ప్రభుత్వానికి, నిరుద్యోగుల మధ్య వారధిగా ఉంటానని, మీ ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బల్మూర్ వెంకట్ చెప్పారు. తాను కూడా మీతో ఉద్యమాలు చేసిన వ్యక్తినే అని, కోర్టు కేసులు, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు ఇలా కొన్ని సమస్యల కారణంగా కొన్ని నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయని ఆయన వివరించారు. కాస్త ఆలస్యమైనా నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు భర్తీ చేస్తారని భరోసా ఇచ్చారు.

అధికారం పోగానే నిరుద్యోగులు గుర్తొచ్చారా?

అధికారం పోగానే బీఆర్ఎస్ కు నిరుద్యోగులు గుర్తొచ్చారా?, పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేసారు? అని ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేపర్ లీకులు చేసి నిరుద్యోగుల ఆత్మహత్యకు కారణమైంది బీఆర్ఎస్ అని, ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే అరెస్ట్ చేసింది ఆ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇప్పుడు సంగ్రామం పేరుతో రాజకీయాలా ? అని మెట్టు సాయికుమార్ ధ్వజమెత్తారు. 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం, ఇది మా కమిట్మెంట్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వకుంట్ల కుటుంబానికి తప్పా ఎవరికీ ఉద్యోగాలు రాలేదని, మీది విద్రోహ సభ అని మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు.

Next Story