నాగర్‌కర్నూల్ జిల్లాలో బైక్ చోరీల ముఠా అరెస్ట్

by Batti.Sumithra |

నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపుతున్న బైక్ చోరీల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో బైక్ చోరీల ముఠా అరెస్ట్
X

దిశ, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపుతున్న బైక్ చోరీల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నాగర్‌కర్నూల్, బిజినపల్లి పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి మొత్తం 52 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా జంగం యాదయ్య, చింతకాయల శివకుమార్ ఇద్దరూ కలిసి నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వస్తుండగా పోలీసులు ఆపి విచారించారు. విచారణలో ఆ బైక్ చోరీ చేసినదేనని వారు ఒప్పుకున్నారు. వారి కదలికల ఆధారంగా బిజినపల్లి పోలీసులు మరో నిందితుడు పిట్టల చరణ్‌కుమార్‌ను పట్టుకున్నారు. మరొక నిందితుడు సంతోష్ నాయక్ ఇప్పటికే మహబూబ్‌నగర్ జైలులో ఉండగా, మిగిలిన ముగ్గురిని శనివారం రిమాండ్‌కు తరలించారు.

నిందితులు నాగర్‌కర్నూల్‌తో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, యాదాద్రి, షాద్‌నగర్ పరిధుల్లో బైక్ చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పార్క్ చేసిన బజాజ్ పుల్సార్, హోండా షైన్, యునికార్న్ వంటి బైక్‌లను చోరీ చేసి, సంతోష్ నాయక్ వాటిని తక్కువ ధరలకు వివిధ గ్రామాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవాడు. ప్రస్తుతం సంతోష్ నాయక్ గంజాయి కేసులో అరెస్టై మహబూబ్‌నగర్ జైలులో ఉన్నాడు. నిందితుల నుంచి మహబూబ్‌నగర్ పరిధిలోని 20, సైబరాబాద్ పరిధిలోని 14, హైదరాబాద్ పరిధిలోని 4, వనపర్తి పరిధిలోని 3, యాదాద్రి పరిధిలోని 3, ఇతర ప్రాంతాలకు చెందిన 8 వాహనాలు కలిపి మొత్తం 52 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. తమ వాహనాలు చోరీకి గురైన వారు సంబంధిత పత్రాలతో సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. రాత్రి వేళల్లో వాహనాలను సురక్షిత ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని, డబుల్ లాక్ తప్పనిసరిగా ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ అశోక్ రెడ్డి, ఎస్సైలు గోవర్ధన్, శంశోద్దీన్, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story