సోనూ, దేవ్‌జీ వర్గాల కలయికపై ఉత్కంఠ.. మాజీ మావోయిస్టుల అడుగులు ఎటువైపు?

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-13 01:52:30  IST  )

తెలంగాణలో మాజీ మావోయిస్టుల రాజకీయ పునరేకీకరణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోనూ-ఆశన్న, దేవ్‌జీ వర్గాలు ఏకమై కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతాయా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

సోనూ, దేవ్‌జీ వర్గాల కలయికపై ఉత్కంఠ.. మాజీ మావోయిస్టుల అడుగులు ఎటువైపు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మావోయిస్టులు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు గురువారం సీపీఐ ఆఫీసుకు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వారి కార్యక్రమం రద్దయినా చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్‌జీ వర్గం.. తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లో ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వారి తదుపరి ప్రయాణంపై విప్లవోద్యమ అభిమానులు, రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తి నెలకొన్నది. అక్టోబర్‌లో లొంగిపోయిన ‘సోనూ-ఆశన్న’ వర్గం.. అనంతరం సరెండర్ అయిన ‘దేవ్‌జీ’ వర్గాలు రెండూ కలిసి ఒకే వేదిక ఏర్పాటు చేసుకుని పోరాడవచ్చు కదా.. అనేదే ఈ చర్చ సారాంశం.

కొత్తదారి కోసం..

కొత్త రాజకీయ వేదిక కోసం ఆలోచిస్తున్నామని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సోనూ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. గతవారం రాయ్‌పూర్ వెళ్లి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కార్యకలాపాలను పరిశీలించిన ఆశన్న టీం.. ఈ వారం తెలంగాణకు వచ్చి వెళ్లింది. వారి 5 రోజుల పర్యటనలో తమ కుటుంబాల సందర్శనతోపాటు వరంగల్ సమీపంలోని బట్టుపల్లిలో అమరుల కుటుంబాలను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆశన్న.. తాము చట్టబద్ధంగా పనిచేసే కొత్త దారి కోసం వెతుకుతున్నామని, ఇప్పుడున్న పార్టీల్లో అయితే చేరబోమని స్పష్టం చేశారు. తాము తొందర పడదల్చుకోలేదని, నలభై ఏళ్లుగా అన్నీ త్యాగం చేసిన తాము ఇకముందు కూడా ప్రజల కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు.

ఇద్దరి మార్గం ఒకటేనా..

‘సోనూ-ఆశన్న’ వర్గం లొంగిపోయినప్పుడు వారిపై ద్రోహులు అంటూ ముద్ర వేసిన ‘దేవ్‌జీ’ వర్గం తాజాగా తాము కూడా చట్టబద్ధంగా పనిచేస్తామని చెప్పారు. దీంతో ఇద్దరి దారుల్లో తేడా ఏముందని విప్లవాభిమానులు, పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాలు అప్పగించడం, అప్పగించకపోవడం కూడా ఇప్పుడు సమస్య కాదని, అందరూ చేసింది అదే కదా? అంటున్నారు. బయటకు రావడానికి కారణం.. దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా విఫలమైందని, తాత్కాలిక పోరాట విరమణే తక్షణ మార్గమని సోనూ వర్గం చెప్పి లొంగుబాట పట్టిందని, దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క తదితరులు మాత్రం అనారోగ్యం, వృద్ధాప్యం.. అంటూ ఇతర కారణాలు చెప్పారని గుర్తుచేస్తున్నారు. కానీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన మాత్రం ఇద్దరూ చట్టబద్ధ పోరాటమే చేస్తామని ప్రకటించారని అంటున్నారు.

మొత్తం 3 వేలమంది పైనే..

భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరి మధ్య పెద్దగా వైరుధ్యాలు లేనప్పుడు రెండు వర్గాలు ఏకమైతే బలమైన వేదిక తయారవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి 2026 మార్చి 10 వరకు మొత్తం 2,650 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, జైల్లో ఉన్నవారి సంఖ్య కలిపితే, ఇది మూడు వేలకు చేరవచ్చని అంటున్నారు. ఇంతమంది పూర్తికాలం పనిచేస్తూ ఒక రాజకీయ పార్టీ లేదా వేదికను ఏర్పాటు చేసి నడిపిస్తే అనతికాలంలోనే ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వామపక్షాలు కూడా కలిస్తే..

దేవ్‌ జీ వర్గాన్ని తమ ఆఫీసుకు ఆహ్వానించిన సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) గ్రూపులు కనుక మాజీ మావోయిస్టులతో ఏకమైతే, దేశ రాజకీయాల్లో కీలక మార్పు వచ్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనమవుతున్న పరిస్థితుల్లో ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ-శ్రీకాకుళ పోరాటాలు, ఇప్పుడు మావోయిస్టుల దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఫలించని నేపథ్యంలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిసి కొత్తదారి కోసం అన్వేషించడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. సోనూ-ఆశన్న, దేవ్‌జీ వర్గాలు ఈ కోణంలో ఆలోచించాలని, తమ మధ్య ఉన్న ఇతర విభేదాలను పక్కన పెట్టి ప్రజల మేలు కోసం కలవాలని సూచిస్తున్నారు.

Next Story