బుల్లెట్ ట్రైన్‌కు జహీరాబాద్ స్టాప్ ఇవ్వాలి.. కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన బీఆర్ఎస్ బృందం

by Ramesh Naini |

ప్రతిపాదిత హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) కారిడార్‌లో జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను చేర్చడంతో పాటు అక్కడ బుల్లెట్ ట్రైన్ స్టాప్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలోని బృందం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను గురువారం పార్లమెంట్‌లో కలిసి వినతిపత్రం అందజేసింది.

బుల్లెట్ ట్రైన్‌కు జహీరాబాద్ స్టాప్ ఇవ్వాలి.. కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన బీఆర్ఎస్ బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపాదిత హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) కారిడార్‌లో జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను చేర్చడంతో పాటు అక్కడ బుల్లెట్ ట్రైన్ స్టాప్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలోని బృందం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను గురువారం పార్లమెంట్‌లో కలిసి వినతిపత్రం అందజేసింది. జహీరాబాద్‌లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్), ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ప్రతిపాదిత డ్రై పోర్ట్, హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక పారిశ్రామిక ప్రాజెక్టులు అమలవుతున్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ స్టాప్ మంజూరు చేయాలని వారు కోరారు. జహీరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతోందని, ఇప్పటికే మహీంద్రా, అల్లానా, పిరమల్ తదితర ప్రముఖ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని బృందం కేంద్ర మంత్రికి వివరించింది. భవిష్యత్తులో మూడు లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశమున్నందున హైస్పీడ్ రైలు అనుసంధానం వల్ల పెట్టుబడులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాలకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొంది.

అదేవిధంగా జహీరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ స్టాప్ ఏర్పాటు చేస్తే తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని, ప్రయాణికుల రద్దీతో పాటు రైల్వే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని వినతిపత్రంలో వెల్లడించారు. హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ డీపీఆర్‌లో జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను చేర్చి, అక్కడ స్టాప్ మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని బీఆర్ఎస్ బృందం కోరింది. ఈ బృందంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కే. మాణిక్ రావు, మెదక్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం. శివ కుమార్ పాల్గొన్నారు.

Next Story