కేసీఆర్‌కు కమిటీ ఆహ్వానం.. ఉద్యమకారుల గుర్తింపుపై సూచనలు కోరనున్న కోదండరాం

by Ramesh Naini |

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాలను కూడా స్వీకరిస్తామని తెలంగాణ గుర్తింపు కమిటీ సభ్యుడు ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం తెలిపారు.

కేసీఆర్‌కు కమిటీ ఆహ్వానం.. ఉద్యమకారుల గుర్తింపుపై సూచనలు కోరనున్న కోదండరాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాలను కూడా స్వీకరిస్తామని తెలంగాణ గుర్తింపు కమిటీ సభ్యుడు ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం తెలిపారు. కమిటీ సమావేశానికి రావాలని కేసీఆర్‌కు లేఖ రాసి, ఆయన సూచనలు, సలహాలు, అభిప్రాయాలను కమిటీ ముందు వెల్లడించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక భవనంలో తెలంగాణ కోసం ఉద్యమించిన మహిళా సంఘాల ప్రతినిధులతో తెలంగాణ గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించింది. భారీ సంఖ్యలో మహిళా ఉద్యమకారులు హాజరై పలు సూచనలు, అభిప్రాయాలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ కే. కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం కలిగే విధంగా కమిటీ నివేదిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమం నుంచి 2009 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన సమావేశాలతో పాటు అభిప్రాయాలు తెలియజేయలేక పోయిన వారికి కూడా అవకాశం కల్పించనున్నట్లు కేశవరావు వెల్లడించారు.

త్వరలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు

త్వరలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు, సూచనలు స్వీకరించే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే కీలక సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుంచి 16 రోజుల పాటు వివిధ వర్గాల నుంచి కమిటీ అభిప్రాయాలు సేకరించిందని, సుమారు 13 వేల మంది సమావేశాలకు హాజరయ్యారని, వెయ్యి మందికి పైగా తమ అభిప్రాయాలను నమోదు చేశారని కేశవరావు తెలిపారు. కమిటీ పరిధి ఉద్యమకారులను గుర్తించడం మాత్రమేనని, దీనికి రాజకీయ పార్టీలతో లేదా సంఘాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న కొందరు ఇప్పటికీ బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కేసీఆర్ పట్ల తమకు గౌరవం ఉంది

కేసీఆర్ పట్ల తమకు గౌరవం ఉందని పేర్కొన్న కోదండరాం, ఆయన అనుభవం కమిటీకి ఉపయోగపడుతుందని చెప్పారు. త్వరలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరిస్తామని వెల్లడించారు.

మహిళా ఉద్యమకారుల ఆందోళన

సమావేశం సందర్భంగా కొందరు మహిళా ఉద్యమకారులు కమిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమైన ఉద్యమకారుల అభిప్రాయాలను కమిటీ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపిస్తూ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు వారికి వివరణ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Next Story