- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.1.23 కోట్ల మోసం.. మాజీ డిపో మేనేజర్‌కు ఏడాది జైలు
రూ.1.23 కోట్ల విలువైన కంపెనీ స్టాక్‌ను అక్రమంగా మళ్లించి నమ్మకద్రోహం, మోసానికి పాల్పడిన కేసులో మాజీ డిపో మేనేజర్‌కు న్యాయస్థానం ఒక సంవత్సరం సాధారణ జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.

దిశ, చంపాపేట్ : రూ.1.23 కోట్ల విలువైన కంపెనీ స్టాక్‌ను అక్రమంగా మళ్లించి నమ్మకద్రోహం, మోసానికి పాల్పడిన కేసులో మాజీ డిపో మేనేజర్‌కు న్యాయస్థానం ఒక సంవత్సరం సాధారణ జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 2017లో నమోదైన ఈ సంచలన కేసులో చాదర్‌ఘాట్ పోలీసుల సమగ్ర దర్యాప్తుతో నిందితుడిపై అభియోగాలు రుజువై శిక్ష పడింది. పోలీసుల కథనం ప్రకారం సోమాజిగూడలోని 3ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలో డిపో మేనేజర్‌గా పనిచేసిన ఎం. వీర వెంకట కృష్ణారావు 2016లో కంపెనీ ఈఆర్‌పీ (ERP) నుంచి ఎస్‌ఏపీ (SAP) సాఫ్ట్‌వేర్‌కు మారుతున్న సమయంలో యాజమాన్యానికి తెలియకుండా మాన్యువల్ బిల్లులు సృష్టించి కంపెనీ స్టాక్‌ను అక్రమంగా మళ్లించాడు. అనంతరం నిర్వహించిన ఆడిట్‌లో కంపెనీ రికార్డుల్లో ఉండాల్సిన 17,720 యూనిట్లకు బదులుగా కేవలం 4,810 యూనిట్లు మాత్రమే ఉండగా, 12,910 యూనిట్ల స్టాక్ గల్లంతైనట్లు బయటపడింది. ఈ స్టాక్ విలువ రూ.1,23,21,934గా అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో నిందితుడు తన తప్పును అంగీకరిస్తూ నష్టాన్ని భర్తీ చేస్తానని బాండ్లు ఇచ్చినప్పటికీ, డబ్బు చెల్లించకుండా విధులకు గైర్హాజరై పరారయ్యాడు. కంపెనీ సిబ్బందిని బెదిరించినట్లు, దుర్వినియోగం చేసిన సొమ్ముతో వ్యక్తిగత ఆస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. చాదర్‌ఘాట్ పోలీసులు సేకరించిన పటిష్టమైన సాక్ష్యాధారాల ఆధారంగా కేసును న్యాయస్థానంలో విజయవంతంగా నిరూపించారు. దీంతో నాంపల్లిలోని 8వ అదనపు ప్రధాన న్యాయ మేజిస్ట్రేట్ నిందితుడిని భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద దోషిగా నిర్ధారిస్తూ ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పు ఆర్థిక నేరాలకు పాల్పడే వారికి హెచ్చరికగా నిలుస్తుందని, సంస్థల ఆస్తులను దుర్వినియోగం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగుతాయని చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపారు.






