- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేద విద్యార్థిని ఉన్నత చదువులకు మంత్రి కోమటిరెడ్డి భరోసా
పేద విద్యార్థిని ఉన్నత చదువులకు మంత్రి కోమటిరెడ్డి భరోసా కల్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుపేద విద్యార్థిని కలలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. దేవరకొండకు చెందిన ఓ నిరుపేద రోజువారీ కూలీ కుటుంబానికి చెందిన విద్యార్థిని పరిమళ తన ప్రతిభతో అత్యున్నతమైన ఐఐటీ సీటును సాధించింది. ఐఐటీ మద్రాస్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఆమె... జర్మనీలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదివేందుకు అవకాశం వచ్చింది. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె కలలు నెరవేరుతాయా లేదా అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ దృష్టికి రావడంతో, ఆయన ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులను పిలిపించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారిని మంత్రిని కలిసేలా ఏర్పాట్లు చేశారు.
విద్యార్థిని సాధించిన విజయాన్ని, ఆమె ఐఐటీ చదువు, ఉన్నత విద్య కోసం విద్యార్థిని అంకితభావాన్ని తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి ఆపద్బాంధవుడిలా స్పందించారు. పేదరికం కారణంగా ప్రతిభ మరుగున పడకూడదనే ఉద్దేశంతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి, ఆమె విదేశీ ఉన్నత విద్యకు అండగా నిలిచారు. ప్రతిభకు పేదరికం ఎప్పుడూ అడ్డుకాదని... అవకాశం కల్పిస్తే నిరుపేద విద్యార్థులు ప్రపంచ వేదికపై తమ సత్తా చాటగలరని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పేద విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉన్నత విద్యకు భరోసాగా నిలవడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించబోతున్న ఆ విద్యార్థిని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.






