- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఎస్‌ఐఆర్' ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియను తప్పులు లేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు.

దిశ, మహబూబ్‌నగర్ ప్రతినిధి : జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తప్పులు లేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ డిజిటైజేషన్ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 79.62 శాతం డిజిటైజేషన్, 86.55 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన** పూర్తయిందని వెల్లడించారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు పేర్కొంటూ, ఒక పోలింగ్ స్టేషన్‌లో 1,200 మందికి మించి ఓటర్లు ఉంటే ప్రత్యామ్నాయ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఆర్‌ఓలకు ఆదేశించినట్లు తెలిపారు. వీఐపీ ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, 85 ఏళ్లు దాటిన ఓటర్ల వివరాల ధృవీకరణ, మొబైల్ నంబర్ల నవీకరణ వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారు మళ్లీ భౌతికంగా ఫారం ఇవ్వాల్సిన అవసరం లేదని, బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో వివరాలను మాత్రమే ధృవీకరిస్తారని స్పష్టం చేశారు. మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల పేర్లను పూర్తి విచారణ అనంతరం మాత్రమే తొలగిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల తొలగింపు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై అభ్యంతరాలు తదితర అంశాలపై సందేహాలు వ్యక్తం చేయగా, వాటిపై కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదనే కారణంతో మాత్రమే ఓటర్ల పేర్లను తొలగించబోమని, క్షేత్రస్థాయి విచారణ అనంతరమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆగస్టు 3తో ప్రస్తుత ప్రక్రియ ముగిసిన తర్వాత ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని, అనంతరం ప్రజలు, రాజకీయ పార్టీలు అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, జెఎల్‌బి హరిప్రియ, ఎన్నికల డీటీ జాఫర్, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరామ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.






