- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశీ కుట్రలతో దేశంలో అశాంతికి కాంగ్రెస్, వామపక్షాల ప్రయత్నం: రాంచందర్ రావు
దేశంలో అశాంతి నెలకొల్పి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు కలిసి కుట్ర పన్నుతున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో అశాంతి నెలకొల్పి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు కలిసి కుట్ర పన్నుతున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహా పరిస్థితులను భారత్‌లో సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పూణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీల్లో నిర్వహించిన కార్యక్రమాలకు విదేశీ శక్తుల మద్దతు ఉందని, ఖలిస్తానీ వర్గాలు, కతార్, కెనడా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి ఆర్థిక సహకారం అందుతోందని పేర్కొన్నారు. నీట్ పరీక్ష లీకేజీ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని 31 మందిని అరెస్టు చేసిందని, విద్యార్థులకు నష్టం జరగకుండా రీ-ఎగ్జామ్స్ నిర్వహించిందని తెలిపారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం కఠిన చట్టాన్ని అమలు చేస్తోందని, ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టిందని చెప్పారు.
యూపీఏ హయాంలో అనేక జాతీయ స్థాయి పరీక్షల పేపర్లు లీక్ అయినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు బాధ్యత వహించలేదని విమర్శించిన ఆయన, ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతున్న కాంగ్రెస్ తన గతాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఉద్యోగాల కల్పనలో ఎన్డీయే ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టించిందని, 2014–2024 మధ్య 17 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నిరుద్యోగిత రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్ఐటీలు, మెడికల్ కళాశాలల సంఖ్య పెంచడంతో పాటు ఉన్నత విద్యలో ప్రవేశాలు కూడా విస్తరించాయని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని హెచ్చరించిన రాంచందర్ రావు, దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రయత్నాలను భారత యువత తిప్పికొడుతుందని అన్నారు.






