లక్షల్లో విద్యుత్ బిల్లుల బకాయి ?

by Batti.Sumithra |

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో గురువారం అంధకారం అలుముకుంది.

లక్షల్లో విద్యుత్ బిల్లుల బకాయి ?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో గురువారం అంధకారం అలుముకుంది. గత కొన్ని నెలలుగా బకాయి పడిన విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు ఉదయం కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో కార్యాలయంలో కంప్యూటర్లు పనిచేయక సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. వైద్య ఆరోగ్యశాఖలోని మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రులకు ప్రధాన కార్యాలయంగా ఉన్న డీఎంఈ కార్యాలయానికి ప్రతిరోజూ జిల్లాల నుంచి వైద్యులు, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉద్యోగుల మెడికల్ బిల్లుల రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ కూడా ఇక్కడి నుంచే నిర్వహిస్తారు.

అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విధులకు హాజరైన సిబ్బంది కరెంటు లేదని చెప్పి చేతులెత్తేశారు. గత కొన్ని నెలలుగా డీఎంఈ కార్యాలయం చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయి సుమారు రూ.15 లక్షల వరకు ఉందని తెలిసింది. ఈ బకాయిలు చెల్లించాలని పలుమార్లు డీఎంఈ కార్యాలయానికి డిమాండ్ నోటీసులు పంపినా అధికారులు పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక విద్యుత్ అధికారులు సరఫరాను నిలిపివేశారు. అయితే ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అప్పటికే కార్యాలయ పనుల నిమిత్తం జిల్లాల నుంచి వచ్చిన పలువురు వెనుదిరిగారు.

Next Story