- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరసనలో ఉద్వేగభరిత దృశ్యం.. కంటతడి పెట్టిన నీట్ విద్యార్థిని
ఢిల్లీలో విద్యార్థుల పై జరిగిన ఘటనకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తమ పదవులకు రాజీనామా చేయాలని పలువురు విద్యార్థులు, ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

దిశ, రాంనగర్ : ఢిల్లీలో విద్యార్థుల పై జరిగిన ఘటనకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తమ పదవులకు రాజీనామా చేయాలని పలువురు విద్యార్థులు, ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఢిల్లీలో జరిగిన ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనలకు సంఘీభావంగా పీఓడబ్ల్యూ నాయకులు సంధ్య, ఝాన్సీ, బండారు విజయ, స్వరూప, విష్ణు తేజ, భూమిక ఆర్గనైజేషన్‌కు చెందిన జ్యోతిరావు తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, నాయకులు మాట్లాడుతూ... ఢిల్లీలో గత 24 రోజులుగా నీట్ లీకేజీని వ్యతిరేకిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనం వాంగ్‌చుక్ దీక్ష చేస్తుంటే, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం పాశవికంగా పోలీసు దాడులు చేయడం అమానవీయమన్నారు.
విద్యార్థుల ప్రయోజనాల కంటే బీజేపీ నాయకులు తమ అధికారాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో పలు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటుచేసుకోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని చెప్పారు. నీట్ పరీక్షల లీకేజీ కారణంగా పలువురు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. వేలల్లో మాత్రమే ఉద్యోగ అవకాశాలు వెలువడుతున్నప్పటికీ లక్షలాది మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేస్తున్నారని, మిగిలిన నిరుద్యోగ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, సమూలమైన విద్యా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో పలు కేంద్ర విశ్వవిద్యాలయాల విద్యార్థులు, మహిళా సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోపక్క ఈ నిరసన ఆందోళనలో ఉద్వేగభరిత దృశ్యం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఓ నీట్ విద్యార్థిని మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థుల ఆందోళనను తప్పుబడుతూ సోషల్ మీడియాలో విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ఆమె నిలదీశారు. తాము రోడ్ల మీదకు రావాలని అనుకోవడం లేదు. రోజుకు 16 గంటలు చదివి, తమ జీవితాలను పణంగా పెట్టి పరీక్షలు రాస్తున్నాం. పేపర్ లీక్ అయినప్పుడు, మా భవిష్యత్తు అనిశ్చితంగా మారినప్పుడు ప్రశ్నించడం తప్పా? మమ్మల్ని విమర్శించే ముందు ఒక్కసారి మా పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతుండగానే అక్కడున్న తోటి విద్యార్థులు చప్పట్లతో మద్దతు తెలిపారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






