1.92 లక్షల జనాభాకు ఒక సీటు.. తెలంగాణలో డీలిమిటేషన్ లెక్కలివే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-17 02:34:21  IST  )

తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, లోక్‌సభ స్థానాలు 17 నుండి 26కు పెరగనున్నాయి.

1.92 లక్షల జనాభాకు ఒక సీటు.. తెలంగాణలో డీలిమిటేషన్ లెక్కలివే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పెరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య ఖరారు అయింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 17 ఎంపీ స్థానాలు 26‌కు పెరగనున్నాయి. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరగనున్నాయి. ఇందులో 9 లోక్‌సభ స్థానాలు మహిళలు, 60 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్​ కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయనున్న నేపథ్యంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలపై స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో 3,50,03,674 జనాభా ఉందని జనాభా లెక్కల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1.92 లక్షల జనాభా ఉండే విధంగా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. పెరగనున్న సీట్లలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 15 స్థానాలు కాస్త 20కు చేరుకోనున్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల్లో 13 సీట్లు కానున్నాయి. వీటి తర్వాత నిజామాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 8 చొప్పున సీట్లు కానున్నాయి. అతి తక్కువగా ములుగు, భూపాలపల్లిలో రెండు సీట్ల చొప్పున కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీలకు 12 నుంచి 16కు, ఎస్సీలకు 19 నుంచి 28 సీట్లు పెరగనున్నాయి. గురువారం పునర్విభజన, మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​షా మాట్లాడుతూ.. తెలంగాణలో 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయని ఆయన ప్రకటించారు. ఒక్కో లోక్‌సభ సీటుకు 7 అసెంబ్లీ స్థానాల చొప్పున 182 స్థానాలు కానున్నాయి. ఈ లెక్కన వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆశావాహులకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నాయి.

1.92 లక్షల జనాభాకు ఒక సీటు..

2011 జనాభా లెక్కల ప్రకారం.. తెలంగాణలో 3,50,03,674 జనాభా ఉండగా ఇందులో పురుషులు 1.76 కోట్లు, మహిళలు 1.73 కోట్లు ఉన్నట్లుగా జనాభా లెక్కల అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లు కానున్నాయి. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1.92 లక్షల జనాభా ఉండేలా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి 10 శాతం ఎక్కువ కానీ, 10 శాతం తక్కువ కానీ జనాభా ఉండేలా నియోజకవర్గాలను రూపొందించవచ్చు. ఈ నిబంధన పునర్విభజన కమిషన్‌లో పొందుపర్చనున్నారు. గతంలోనూ ఈ నిబంధన ఉంది. నియోజకవర్గాల పునర్విభజనను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తెలంగాణలో ఎస్సీల జనాభా 54.09 లక్షలుగా ఉంది. ఎస్సీలకు 15.45 శాతం సీట్లు రిజర్వ్​చేయాల్సి ఉంటుంది. ఎస్టీల జనాభా 31.78 లక్షలుగా ఉంది. దీంతో ఎస్టీలకు 9.08 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది. మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీగా పరిగణిస్తారు. ఈ లెక్కల ప్రకారం ఎస్సీలకు 28 అసెంబ్లీ సీట్లు, ఇందులో 9 సీట్లు ఆ వర్గానికి చెందిన మహిళలకు, ఎస్టీలకు 16 సీట్లు కేటాయించనున్నారు. ఇందులో 5 సీట్లు మహిళలకు రిజర్వ్​కానున్నాయి. 138 సీట్లు జనరల్ కేటగిరిలో ఉంటాయి. ఇందులో మహిళలకు 46 సీట్లు రిజర్వ్​కానున్నాయి. మొత్తంగా మహిళలకు 60 సీట్లు రిజర్వ్​అవుతాయి. మహిళా, ఎస్టీ, ఎస్సీ సీట్లను రాష్ట్ర స్థాయి జనాభా ఆధారంగా ఖరారు చేస్తారు. అత్యధిక జనాభా ఉండే స్థానాలను ఆయా వర్గాలకు ఖరారు చేయనున్నారు.

ఉదాహరణ తీసుకుంటే రాష్ట్రంలో ఎస్సీ అత్యధిక జనాభా ఉండే 28 సీట్లను ఆ వర్గాలకు, అత్యధిక జనాభా ఉండే 16 సీట్లను ఎస్టీలకు కేటాయిస్తారు. అత్యధిక జనాభా ఉండే మహిళా స్థానాలను మహిళలకు రిజర్వ్​చేస్తారు. ఈ ప్రక్రియ ఎస్టీలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తరువాత ఎస్సీ, ఆ తర్వాత జనరల్ స్థానాలను ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియను డీలిమిటేషన్​కమిషన్​ఖరారు చేయనుంది. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిని 26కు పెంచాలని నిర్ణయించారు. ఇందులో 9 స్థానాలు మహిళలకు రిజర్వ్​కానున్నాయి. ఇప్పటికే ఎస్సీలకు మూడు, ఎస్టీలకు 2 లోక్‌సభ స్థానాలు రిజర్వ్​ అయి ఉన్నాయి. వీరికి మరోకటి లేదా రెండు సీట్లు వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తారు. గతంలో తెలంగాణ సీట్లు 17 ఉండగా దేశంలోని సీట్ల శాతంలో ఇది 3.13 శాతంగా కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన సీట్ల ప్రకారం 26కు పెరగనున్నాయి. దీంతో దేశంలో తెలంగాణ సీట్ల శాతం 3.18 శాతానికి చేరుతాయని కేంద్ర మంత్రి అమిత్​షా తెలిపారు.

డీ-లిమిటేషన్.. హైబ్రిడ్ పరిష్కారం!

Next Story