డీ-లిమిటేషన్.. హైబ్రిడ్ పరిష్కారం!

by Ravi |   (  Updated:2026-04-17 02:36:00  IST  )

దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ డీలిమిటేషన్ ప్రక్రియ భారత రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారి తీయనుంది. జనాభా ప్రాతిపదికతో పాటు అభివృద్ధి, సామాజిక సూచికలను పరిగణనలోకి తీసుకునే హైబ్రిడ్ విధానం ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య సమతుల్యతను ఎలా కాపాడగలదో తెలుసుకోండి.

డీ-లిమిటేషన్.. హైబ్రిడ్ పరిష్కారం!
X

భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు మరో చారిత్రక సందిగ్ధంలో నిలబడింది. 2026 తర్వాత జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పు మాత్రమే కాదు.. దేశ రాజకీయ దిశను, రాష్ట్రాల మధ్య అధికార సమతుల్యతను శాసించే పెనుమార్పు కానున్నది. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలనే రాజ్యాంగ సూత్రానికి, అభివృద్ధి చెందిన రాష్ట్రాల రాజకీయ ఉనికికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ‘మధ్యేమార్గం’ వెతకాల్సిన బాధ్యత నేటి నాయకత్వంపై ఉంది.

కేంద్రం లెక్కల ప్రకారం ఇప్పుడున్న పార్లమెంట్ సీట్లు 543ను 50 శాతం పెంచుతూ 850కి తేబోతున్నది. అందులో కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించింది. ఇక రాష్ట్రాలకు 815 సీట్లు దక్కనున్నాయి. అయితే, ఏ ప్రాతిపదికన ఈ సీట్లను పెంచుతున్నారనే విషయం స్పష్టంగా చెప్పడం లేదు. ఒక పక్క ఎంపీ సీట్లను 1971లో జరిగిన జనాభా లెక్కన ప్రకారం డీలిమిటేషన్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు. 2011లో జనాభా లెక్కలు జరిగినా.. ఆ తర్వాత జనాభా ఎన్యూమరేషన్ జరగనేలేదు. 2026లో జనాభా లెక్కించే ప్రక్రియ మొదలుకానున్న సమయంలోనే ఈ డీలిమిటేషన్ తీసుకురావడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందులోనే మహిళా బిల్లును తెస్తా మనడం వల్ల గందరగోళంగా మారింది. కేంద్రం నియోజక వర్గాల సంఖ్య పెంచాలన్న ఉద్దేశం సరైనదే.. కానీ, అవలంబిస్తున్న విధానంపైనే దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తున్నది.

డీలిమిటేషన్ అవసరమే.. కానీ,

1950లో ఒక ఎంపీ దాదాపు 5 లక్షల నుంచి 7.5 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడు అది ఏకంగా కొన్ని నియోజకవర్గాల్లో 30 లక్షలకు మించి పోయింది. దీనివల్ల ఓటరు ప్రయోజనాలకు గండిపడుతున్నది. ఒకవేళ జనాభా ప్రాతిపదికను మాత్రమే కొలమానంగా తీసుకుంటే అభివృద్ధి చెందుతున్న లేదా జీడీపీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ప్రయోజనాలకు ఇప్పుడు కాకున్నా.. భవిష్యత్తులో నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. అందుకే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తు‌న్నారు. తమిళనాడు, కర్ణాటక సీఎంలు ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా విఘాతమని ప్రకటించారు. కానీ, విధానంలో మార్పులను సూచించలేదు. ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణాదిలో వృద్ధుల జనాభా పెరుగుతున్నదని.. డివిడెండ్‌లా కేంద్రం గ్రాంట్ ఇవ్వాలని మాత్రం సూచించా రు. అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైబ్రిడ్ విధానాన్ని ప్రొ-రేటా పద్ధతిలో విభజన చేయవచ్చని విశ్లేషించారు.. కేంద్రం డీలిమిటేషన్ ప్రకారం ఉదాహరణకు 100సీట్లు పెంచాలని అనుకుంటే అందులో 50 శాతం 50 సీట్లు జనాభా ఆధారంగా పెంచాలి. మిగతా 50సీట్లు ఆదాయం వస్తున్న రాష్ట్రాలకు మాత్రమే పెంచాలి. దీనివల్ల ఆదాయం వస్తున్న రాష్ట్రాలకు చట్టసభల్లో తగిన గౌరవం కల్పించినట్టు అవుతుంది. లేదంటే ఉత్తరాదిలోని నాలుగైదు రాష్ట్రాల మద్దతు ఉంటే చాలు.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అనే పరిస్థితి వస్తే, దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంట్‌లో అరణ్య రోదనగానే మిగిలే ప్రమాదం ఉన్నది.

ఫెడరల్ స్ఫూర్తికి ‘విప్’ విఘాతం

కేంద్రం చేస్తున్న వాదన ప్రకారం.. ఉత్తరాది అయినా, దక్షిణాది అయినా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంఖ్యలో 50 శాతం పెరుగుతుంది.. దానివల్ల నష్టమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఒక్కటే కాదు.. నియోజకవర్గాల నిధులు సహా ఎన్నో విషయాల్లో భారీ మార్పులు జరుగుతాయి. అందులో దక్షిణాదికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా ఏదైనా బిల్లు విషయంలో అధికార పార్టీ చెప్పిందే ఎంపీలు చేయాల్సి వస్తుంది. సభ్యులు ఎక్కువ ఉన్న ఉత్తరాదికే ఏ పార్టీ అయినా ప్రాధాన్యం ఇవ్వక తప్పదు.. అది అధికారంలో ఉన్నదైనా, ప్రతిపక్షంలో ఉన్నదైనా ‘ఓట్ పోలరైజేషన్’ రాజకీయాలకే మక్కువ చూపిస్తారు. దానివల్ల అనివార్యంగా దక్షిణాది ప్రయోజనాలకు తూట్లు పడక తప్పదు. రాష్ట్ర ప్రయోజనాలకు మరో ముఖ్యమైన అడ్డంకి ‘విప్’.. మనదేశంలో దక్షిణాది ప్రజల సంశయాలు పోగొట్టాలంటే ప్రతి బిల్లుకు విప్ జారీ చేసే సంస్కృతిని కేంద్ర ప్రభుత్వమే పక్కనబెట్టాలి. ముఖ్యమైన బిల్లులకు మాత్రమే విప్ జారీ చేయాలి. ఫలితంగా ప్రాంతీయ అసమానతలకు కారణమయ్యే బిల్లుల విషయంలో ఎంపీలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారు. వాళ్లు దొంగ ఓటు వేయాల్సిన అవసరం లేదు.. ప్రాంతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని బహిరంగంగా ఓటు వేయాలి. దీనివల్ల దక్షిణాది ప్రయోజనాలకు భవిష్యత్తులోనూ నష్టం జరగకుండా ఉంటుంది.

‘హైబ్రిడ్’ ఫార్ములా.. 50:25:25

ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా శాస్త్రీయమైన వెయిటేజీ విధానం అమలు చేయాలి.. అంటే జనాభా ప్రాతిపదికన పెంచే సీట్లను 50 శాతానికి పరిమితం చేయాలి. దేశాభి వృద్ధికి నిధులు సమకూరుస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించడానికి 25 శాతం సీట్లు కేటాయించాలి. సామాజిక అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని విద్య, ఆరోగ్యం, జనాభా నియంత్రణలో రాణించిన రాష్ట్రాలకు గుర్తింపుగా మిగిలిన 25 శాతం సీట్లు కేటాయించాలి. ఈ పద్ధతి వల్ల ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీలో సమతుల్యత ఏర్పడుతుంది. అంతే కాకుండా మిగితా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. డీ-లిమిటేషన్ అనేది ఉత్తర-దక్షిణ విద్వేషాలకు దారితీయకుండా, అందరినీ కలుపుకుపోయే ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో జరగాలి. అంకెలు పెరగడం ముఖ్యం కాదు, ఆ అంకెల వెనుక ఉన్న ప్రజల ఆశయాలకు న్యాయం జరగడం అన్నింటికంటే ముఖ్యమని నాయకులు గుర్తించాలి. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతే మిన్న అని భావించినప్పుడే ఈ క్లిష్టమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

-హరీశ్ ఎస్పీ

[email protected]

1.92 లక్షల జనాభాకు ఒక సీటు.. తెలంగాణలో డీలిమిటేషన్ లెక్కలివే!

Next Story