- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తపాలక వర్గాలకు సమస్యల స్వాగతం..!
కొత్తగా కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం సవాల్‌గా మారింది.

దిశ, కామారెడ్డి: కొత్తగా కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం సవాల్‌గా మారింది. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. రోడ్లు, డ్రైనేజీలు కంపు కొడుతున్నాయి. అనేక వార్డుల్లో తాగునీటి సమస్యల నెలకొన్నది. కామారెడ్డి మున్సిపాలిటీలో ఏడు గ్రామ పంచాయతీల విలీనంతో పట్టణ విస్తీర్ణంతో పాటు జనాభా పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా నిధులు మాత్రం రావడం లేదు. దీంతో పట్టణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోలేక పోతున్నారు. రెండేళ్లుగా మున్సిపాలిటీకి రావాల్సిన ఎలాంటి గ్రాంట్లు, నిధులు విడుదల కావడం లేదు.
ఇటీవల ఇతర నిధులతో అక్కడక్కడ కొంతమేరకు అభివృద్ధి పనులు జరిగినా అవి నామమాత్రంగానే జరిగాయనే విమర్శలు ఉన్నాయి. కనీస మౌలిక సౌకర్యాలైన మంచినీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, రోడ్లు, మురికి కాలువలు, పారిశుధ్య నిర్వహణ వంటి వసతుల కల్పన మున్సిపాలిటీ ప్రధాన బాధ్యత. పట్టణంలో చాలా చోట్ల అంతర్గత రోడ్లు మెరుగుపడిన ఇంకా కొన్ని చోట్ల పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగానే వదిలిపెట్టారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులు సక్రమంగా చేపట్టడం లేదు. ఇన్ని సమస్యలు, సవాళ్ల మధ్య కొత్త పాలకవర్గం కామారెడ్డిలో మున్సిపాలిటీలో పాలనా పగ్గాలు చేపట్టనుంది.
కామారెడ్డి మున్సిపాలిటీలో ఏడు గ్రామ పంచాయతీలు గత పాలకవర్గం కంటే ముందే విలీనమయ్యాయి. గత పాలకవర్గం ఆశించిన స్థాయిలో విలీన పంచాయతీల్లో అభివృద్ధి పనులతో పాటు కనీస సౌకర్యాలను కల్పించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే కొట్టుమిట్టాడుతున్నాయి. చాలా గ్రామాల్లో మురికి కాలువలు లేకపోవడంతో ఇళ్ల మధ్యలో గల రోడ్లపై నుంచి మురికి నీరు ప్రవహిస్తున్నాయి. దీంతో దుర్వాసనతో పాటు దోమలు విజృంభిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ప్రస్తుత కొత్త పాలకవర్గమైనా విలీన పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపడతారని ప్రజలు ఆశిస్తున్నారు.
సెంట్రల్ లైటింగ్ వెలిగేనా..
కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రధాన రోడ్లపై కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, హైమాస్ట్ లైట్లు వెలగడం లేదు. దీంతో వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులు..
గత సంవత్సరం జనవరి నెలలో మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో 15 ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయాయి. దీంతో పట్టణ ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలవుతున్న జనరల్ ఫండ్ నిధులే మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఆ నిధులు కూడా ఉద్యోగుల జీతభత్యాలు, కరెంట్ బిల్లులు, వాహనాలు, కార్యాలయాల నిర్వహణ తదితర ఖర్చులకు సరిపోవడం లేదు. ప్రతి నెల నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ పన్నులు వసూలు చేస్తూ నెట్టుకొస్తున్నారు.
దీంతో పట్టణంలో రెండేళ్లుగా అభివృద్ధి పనులు పూర్తిగా పడకేశాయి. విలీన గ్రామపంచాయతీ లతో పాటు పట్టణ ప్రజలు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇప్ప ఉమారాణి ఎన్నిక కావడంతో పట్టణ ప్రజలు ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. గత పాలకవర్గం లో చేయని అభివృద్ధి పనులతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రస్తుత చైర్ పర్సన్ శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నారు.
నేడు బాధ్యతలు స్వీకరించనున్న చైర్ పర్సన్..
కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఇప్ప ఉమారాణి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో నూతన పాలకవర్గం పూర్తి స్థాయిలో కొలువుదీరి పాలనను సాగించనున్నారు. అయితే నూతన పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలకనున్నాయి. వారిపైనే ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ పాలకవర్గం అయినా తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.






