- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారసత్వ ఆస్తుల బదిలీకి బ్రేక్.. గిఫ్ట్ డీడ్ ఆప్షన్ మాయం!
తెలంగాణ భూభారతి పోర్టల్‌లో గిఫ్ట్ డీడ్ ఆప్షన్ అకస్మాత్తుగా నిలిచిపోవడంతో భూ యజమానులు అధిక స్టాంప్ డ్యూటీ భారాన్ని మోయాల్సి వస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: భూభారతి పోర్టల్‌లో వారంరోజులుగా గిఫ్ట్ డీడ్ ఆప్షన్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఎందుకు ఆగిపోయిందో అధికారుల నుంచి కనీస సమాచారం లేదు. దీంతో తమ వద్దకు వస్తున్న ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకాక మీసేవా కేంద్రాల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. సమస్యను తహశీల్దార్ల దృష్టికి తీసుకెళ్తే.. గిఫ్ట్ డీడ్ కాకుంటే సేల్ డీడ్ చేసుకోమని సలహా ఇస్తున్నారని పేర్కొంటున్నారు. వాస్తవానికి సేల్ డీడ్, పార్టీషన్ డీడ్‌తో పాటే గిఫ్ట్‌డీడ్ ఉండడం ఆనవాయితీ. ధరణి పోర్టల్ అమలులో ఉన్న గిఫ్ట్ డీడ్ భూభారతిలోనూ కంటిన్యూ అయింది. తండ్రి నుంచి వారసులకు ఆస్తిని సులభంగా బదిలీ చేసేందుకు ఉపయోగపడే ఈ విధానంలో స్టాంప్ డ్యూటీ కూడా తక్కువే ఉంటుంది. అయితే గత నెలలో వెలుగుచూసిన స్టాంప్ డ్యూటీ కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆప్షన్లను నిలిపివేసిందా? లేక ఇది కేవలం సాంకేతిక లోపమా? అనే దానిపై స్పష్టత రావడం లేదు. వారసుల పేరిట కొందరు గిఫ్ట్ డీడ్ విధానాన్ని దుర్వినియోగం చేస్తే జాయింట్ రిజిస్ట్రార్లు అప్రమత్తంగా ఉండి ఆ పత్రాలను రద్దు చేయొచ్చు. కానీ పోర్టల్ నుంచి మొత్తానికే ఆ ఆప్షన్‌ను ఎత్తివేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస క్లారిటీ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తుండడంతో గిఫ్ట్ డీడ్ ఆప్షన్‌ను శాశ్వతంగా తొలగిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది.
మూడో స్టెప్ వరకే.. ‘గిఫ్ట్’
భూభారతి పోర్టల్‌లో గిఫ్ట్ డీడ్ మాడ్యూల్ తెరుచుకుంటున్నా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రిజిస్ట్రేషన్ టైప్, నేచర్ ఆఫ్ డీడ్ (గిఫ్ట్), నేచర్ ఆఫ్ సబ్ డీడ్ (గిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్), పట్టాదార్ పాస్ బుక్ నంబర్ ఎంట్రీ తర్వాత ప్రాపర్టీ డిటేయిల్స్‌లోకి వెళ్తున్నది. అది పూర్తి చేసిన తర్వాత డోనర్ ఎవరు అనే అంశాన్ని పూర్తి చేయొచ్చు. ఇక నాలుగో స్టెప్ భూమి గ్రహీత (డోనీ) నుంచి ఆప్షన్ ముందుకు వెళ్లడం లేదు. రిటర్న్ వస్తుంది. ఇది టెక్నికల్ ఇష్యూనా? లేదంటే గిఫ్ట్ డీడ్ ఆప్షన్‌ని తాత్కాలికంగా నిలిపివేశారా? అన్నది కూడా తెలియడం లేదు. ఇది లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేల్ డీడ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం గిఫ్ట్ డీడ్ రాకపోతే సేల్ డీడ్‌కి వెళ్లాలంటూ అధికారులు సలహాలు ఇస్తుండడం గమనార్హం. మరోవైపు స్టాంప్ డ్యూటీ ఆదాయాన్ని పెంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
‘కేవైసీ’లో వేరేవాళ్ల ఆధార్ కార్డులు..
భూభారతి పోర్టల్ ద్వారా పెండింగ్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి కేవైసీలో సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో ధరణిలో ఉన్నట్టే భూభారతిలోనూ విత్ పాస్ బుక్, వితౌట్ పాస్ బుక్‌తో మ్యుటేషన్ చేసుకునే వీలుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు భూభారతి పోర్టల్ ద్వారా మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారు. చలాన్ ప్రకారం అమౌంట్ కట్టి మ్యుటేషన్, పాస్ బుక్ చార్జీలు కూడా చెల్లించారు. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వంటివి అన్నీ సరిగ్గానే నమోదు చేశారు. నెక్ట్స్ స్టెప్ కేవైసీ కోసం మీసేవా కేంద్రానికి వెళ్లి ట్రాన్సాక్షన్ ఐడీ కొట్టగానే భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి బదులుగా మరొకరి ఆధార్ కనిపించింది. అతను ఎవరో కూడా వీళ్లకు తెలియదు. కనీసం అమ్మిన, కొనుగోలు చేసిన కుటుంబాలకు సంబంధం లేని వ్యక్తికి చెందిన ఆధార్ దర్శనమిస్తున్నది. దీంతో కేవైసీ చేయడం కుదరడం లేదు. ‘దరఖాస్తులో నా ఆధార్ పెడితే.. కేవైసీలో వేరే వాళ్ల ఆధార్ కనిపిస్తోంది. ఇప్పుడేం చేయాలి?’ అని అధికారుల వద్దకు వెళ్తే.. తమకేమీ తెలియదంటూ వారు తప్పించుకుంటున్నారు. వారం రోజులుగా మీ సేవ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయి.
రాజాపూర్‌లోనూ అదే పరిస్థితి..
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోనూ కేవైసీ సమస్య ఎదురైంది. పెండింగ్ ఆప్షన్ కింద అప్లయ్ చేసి.. మ్యుటేషన్, పాస్ బుక్ చార్జీల కింద రూ.2799 కూడా కట్టి అప్లయ్ చేశారు. కేవైసీ దగ్గరికి వెళ్లగానే.. కొనుగోలు చేసిన వ్యక్తి ఆధార్ నంబర్ దగ్గర.. గుర్తు తెలియని వ్యక్తి ఆధార్ నంబర్ వస్తున్నది. దీంతో ఎంత ప్రయత్నించినా కేవైసీ కాకపోవడంతో మ్యుటేషన్ నిలిచిపోయింది. గుర్తు తెలియని వ్యక్తుల ఆధార్ నంబర్లు కనిపిస్తుండడంతో కొనుగోలు, అమ్మకందారులు ఆందోళనకు గురవుతున్నారు. కొనుగోలు, అమ్మకందారుల ఆధార్ నంబర్లు మినహా మరేవీ హక్కు పత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్లల్లో రావడం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు.
పొరపాట్లు ప్రమాదకరమే..
తెలంగాణలో భూముల విలువ భారీగా పెరిగింది. ఎకరం రూ.20 లక్షల నుంచి రూ.150 కోట్ల వరకు పలుకుతున్న తరుణమిది. ఇలాంటి సమయంలో డాక్యుమెంట్ల అప్‌లోడ్, కేవైసీ, మ్యుటేషన్ అంశాల్లో ఏ ఒక్క చిన్న పొరపాటు చోటు చేసుకున్నా.. సరిదిద్దే వ్యవస్థ లేదు. ధరణి పోర్టల్‌లో సేల్ డీడ్‌లో ఉన్న పేరు చెన్నమ్మ అయితే చెంద్రమ్మ అని ఎంట్రీ చేస్తే సరిదిద్దడానికి నాలుగు సార్లు అప్లయ్ చేయాల్సి వచ్చింది. నాలుగేండ్లు తిరిగితే తప్ప పేరు మారలేదు. అది కూడా రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటే. అయినా రైతు అధికారుల చుట్టూ తిరిగితే తప్ప పని పూర్తి కాలేదు. ఇలాంటి నేపథ్యంలో కేవైసీలో ఇతరుల ఆధార్ నంబర్లు కనిపిస్తుండడం ఎంతటి ప్రమాదకరమో అధికారులు గుర్తించాలి. ఇప్పటికైనా ఇలాంటి లోపాలను సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
కొత్తపాలక వర్గాలకు సమస్యల స్వాగతం..!
- Tags
- Bhoo Bharati Portal
- Gift Deed Option Missing
- Telangana Land Registration Issues
- Registration Technical Glitch
- Stamp Duty Scam Impact
- Pending Mutation KYC Problems
- Dharani Portal vs Bhoo Bharati
- Property Transfer Issues
- Revenue Department Telangana
- Aadhaar Mismatch in KYC
- Sale Deed vs Gift Deed
- Meeseva Center Troubles
- Telangana Land Records News






