తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్.. మావోయిస్టుల కోసం స్పెషల్ ఫోర్సెస్ వేట

by Kema Shiva Kumar |

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల చొరబాటు వ్యూహాలపై నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్.. మావోయిస్టుల కోసం స్పెషల్ ఫోర్సెస్ వేట
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దు అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతకు, బూట్ల చప్పుళ్లకు సయాయత్తమవుతోంది. మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించేందుకు వ్యూహాలు రచిస్తున్నారన్న సమాచారంతో ఇరు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగంలోకి దిగింది.

‘తాలిపేరు’ ప్రాజెక్టు వద్ద స్పెషల్ ఫోర్సెస్ పహారా

మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లకుండా ఉండేందుకు సరిహద్దుల్లో కీలక ప్రాంతాలపై ఇరు రాష్టరాల పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టును తమ ఆధీనంలోకి తీసుకున్న స్పెషల్ ఫోర్సెస్ (Special Forces) అక్కడ భారీగా మోహరించాయి. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు రాకపోకలు సాగించే ప్రతి దారినీ జల్లెడ పడుతున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలోనే మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీలు ప్రకటించి, జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చాయి. అయితే, ప్రభుత్వాల రిక్వెస్ట్‌ను బేఖాతరు చేస్తూ ఇంకా అడవుల్లోనే ఉండిపోయిన కీలక నేతలు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనితో పాటు, గతంలో లొంగిపోయి ప్రస్తుతం బయట ఉంటున్న పాత మావోయిస్టుల కదలికలపై కూడా నిఘా వర్గాలు కన్నేసినట్లుగా తెలుస్తోంది. వారికి ఏమైనా సహకారం అందుతోందా అనే కోణంలో అణువణువు తనిఖీలు చేస్తున్నారు.

మరింత పడక్బందీగా కూంబింగ్ ఆపరేషన్

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో అత్యాధునిక ఆయుధాలతో స్పెషల్ పోలీస్ బలగాలు ఏజెన్సీ గ్రామాలను (Agency Villages) చుట్టుముట్టి ప్రతి ఇంచు గాలిస్తున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మావోయిస్టులు సరిహద్దు దాటకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story