యూరియా కోసం అన్నదాతల తండ్లాట.. యాప్‌ ఓపెన్ కాక తీరొక్క అవస్థలు!

by Kema Shiva Kumar |

తెలంగాణలో యూరియా బుకింగ్ యాప్ సాంకేతిక లోపాలతో ఓపెన్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యూరియా కోసం అన్నదాతల తండ్లాట.. యాప్‌ ఓపెన్ కాక తీరొక్క అవస్థలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సాగు పనులు ఊపందుకుంటుకున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలకు ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రాష్ట్రంలో యూరియా బుకింగ్ (Urea Booking) కోసం రైతు తీరొక్క అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్ కొన్నిసార్లు టెక్నికల్ సమస్యలతో మోరాయిస్తుండగా.. ఒక్కోసారి అసలు యాప్ ఓపెన్ కావడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు సొసైటీలు, ఫెర్టిలైజర్ షాపుల్లో అసలు యూరియా నిల్వలు ఎక్కడున్నాయో, ఏ ఏ కేంద్రాల్లో స్టాక్ అందుబాటులో ఉందో తెలియక అన్ని జిల్లాల్లో రైతులు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు తిరుగుతూ అల్లాడిపోతున్నారు.

యాప్‌లో టెక్నికల్ సమస్యలు..

ఎరువుల పంపిణీని సులభతరం చేసేందుకు, పారదర్శకంగా మార్చేందుకు తీసుకొచ్చిన ఆన్‌లైన్ యాప్ సిస్టమ్ (Online App System) ప్రస్తుతం రైతులకు శాపంగా మారింది. యాప్ సర్వర్లు పూర్తిగా డౌన్ అవ్వడం, ఓపెన్ చేసినా లాగిన్ (Login) కాకపోవడంతో గంటల తరబడి రైతులు మొబైల్ సెంటర్ల వద్ద, సొసైటీల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొదరైతే పొలం పనులు వదులుకుని మరీ బుకింగ్ కోసం కోసం వస్తే, యాప్ పనిచేయడం లేదని అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాప్ నుంచి యూరియా అధికారికంగా బుకింగ్ కాకపోవడంతో ఇదే అదనుగా భావించిన కొందరు ప్రైవేటు వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యాప్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని.. లేని పక్షంలో పాత పద్ధతిలోనే ఆధార్ కార్డుల ద్వారా నేరుగా యూరియా పంపిణీ చేయాలని ఆయా జిల్లాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story