సంధ్య థియేటర్ కేసులో ట్విస్ట్: హీరో అల్లు అర్జున్‌కు కోర్టు నోటీసులు

by Gantepaka Srikanth |

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఈ నోటీసులు అందాయి.

సంధ్య థియేటర్ కేసులో ట్విస్ట్: హీరో అల్లు అర్జున్‌కు కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఈ నోటీసులు అందాయి. ఈ నెల 22వ తేదీ (సోమవారం) నాడు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద ఘటనపై సమగ్ర విచారణ జరిపిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు దాఖలు చేసిన ఈ ఛార్జ్ షీట్‌లో నటుడు అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A11) చేర్చారు. కాగా, ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని వరుసగా A1 నుంచి A10 వరకు నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

మరో 19 మందికి సమన్లు..

పోలీసులు దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు.. తాజాగా అల్లు అర్జున్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 19 మందికి నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. గతేడాది డిసెంబర్లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సమయంలో అభిమానులు భారీగా తరలిరావడం, తగిన ముందస్తు జాగ్రత్తలు లేకపోవడంతో సంధ్య థియేటర్ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లోనే తీవ్ర దుమారం రేగగా.. పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు థియేటర్ యాజమాన్యంపై చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణ దశలో ఉంది.

Next Story