నీరే మెడిసిన్.. ఈ విధంగా తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా లేదిక!

by Javid Pasha |   (  Updated:2026-06-19 11:00:42  IST  )

రాత్రంతా మనం నిద్రపోతున్నప్పుడు శరీరం సహజంగానే చెమట, శ్వాస ద్వారా కొంత నీటిని కోల్పోతుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీరు తాగడం మంచిది.

నీరే మెడిసిన్.. ఈ విధంగా తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా లేదిక!
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు కలిగిన సమతుల్య ఆహారం మాత్రమే కాదు. సమయానికి సరిపడా నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక సహజమైన మెడిసిన్ లాంటిది. ఎవరైతే నీళ్లు తక్కవగా తాగుతారో వారు త్వరగా అనారోగ్యాల బారినపడే అవకాశం ఉంటుంది. అందుకే టైమ్ టు టైమ్ వాటర్ తాగుతూ ఉండాలి. అయితే నిపుణుల ప్రకారం.. ఎప్పుడెప్పుడు ఎలా తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో..

రాత్రంతా మనం నిద్రపోతున్నప్పుడు శరీరం సహజంగానే చెమట, శ్వాస ద్వారా కొంత నీటిని కోల్పోతుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీరు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీని వల్ల రాత్రి కోల్పోయిన ద్రవాలు మళ్ళీ శరీరానికి అందుతాయి. అంతేకాకుండా మెటబాలిజం (జీవక్రియ)ను వేగవంతం చేయడానికి, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, విష పదార్థాలను (Toxins) బయటకు పంపడానికి సహాయపడుతుంది. రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండటానికి ఇది ఒక మంచి అలవాటు.

భోజనం తర్వాత..

భోజనం చేసిన తర్వాత తగినంత నీరు తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. మనం తిన్న ఆహారం సులభంగా విచ్ఛిన్నమవడానికి, అందులోని పోషకాలను శరీరం సమర్థవంతంగా గ్రహించడానికి ఈ అలవాటు ఎంతగానో తోడ్పడుతుంది. అలాగనీ.. భోజనం చేసిన వెంటనే లీటర్ల కొద్దీ నీరు తాగేయడం కూడా సరికాదు. తగినంత పరిమాణంలో తాగాలి. మీ శరీర తత్వాన్ని బట్టి సరిపోయినంత నీరు తాగాలి. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పడుకునే ముందు..

రాత్రి పడుకోవడానికి ముందు నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. ఆరోగ్య నిపుణులు సైతం ఇదే చెబుతున్నారు. పడుకోవడానికి కొద్దిసేపు ముందు కొద్దిగా నీరు తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరం రాత్రంతా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ అలవాటు నిద్రలో గుండె పనితీరును, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. అయితే.. నిద్రపోవడానికి ముందే మరీ ఎక్కువ నీరు తాగితే రాత్రి పదే పదే మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది కాబట్టి, మితంగా (ఒక చిన్న గ్లాసు) తాగడం మంచిది.

మొత్తం ఆరోగ్యానికి..

మొత్తంగా చూస్తే, మానవ శరీరంలో సగానికి పైగా నీరే ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా, కిడ్నీలు వ్యర్థాలను వడపోసి బయటకు పంపాలన్నా.. నీరు అత్యంత అవసరం. అంతేకాకుండా సరైన మోతాదులో నీరు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుందని, కండరాల నొప్పులు తగ్గుతాయని, రోజంతా శక్తివంతంగా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, దాహం వేసే వరకు ఆగకుండా రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story