చిన్న సినిమాలకు థియేటర్స్ దక్కనివ్వడం లేదు.. స్టార్ హీరోలపై మనోజ్ బాజ్‌పాయ్ సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |

విధ్యమైన కథలతో వచ్చే చిన్న బడ్జెట్ చిత్రాలు థియేటర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.

చిన్న సినిమాలకు థియేటర్స్ దక్కనివ్వడం లేదు.. స్టార్ హీరోలపై మనోజ్ బాజ్‌పాయ్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ సినీ పరిశ్రమలో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోల సినిమాల హవా రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ.. వైవిధ్యమైన కథలతో వచ్చే చిన్న బడ్జెట్ చిత్రాలు థియేటర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. భారతీయ సినీ రంగంలో చిన్న, పెద్ద సినిమాల మధ్య సమానమైన అవకాశాలు కల్పించే ఒక బలమైన వ్యవస్థ అత్యవసరమని ఆయన చెప్పారు. ప్రస్తుతం పెద్ద స్టూడియోలు, స్టార్ హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు తమ ప్రభావాన్ని ఉపయోగించి థియేటర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్నారని మనోజ్ ఫైర్ అయ్యారు. వారు ఎగ్జిబిటర్లను ఒత్తిడికి గురిచేస్తూ అత్యధిక షోలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారని ఆరోపించారు.

దీనివల్ల మంచి కథలతో వచ్చిన ఎన్నో చిన్న చిత్రాలకు సరైన స్క్రీన్లు, షోలు దక్కడం లేదని, ఫలితంగా అవి ప్రేక్షకులకు చేరకముందే కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్క్రీన్ల కొరత సమస్య కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదని, దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని అన్నారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండగ సీజన్లలో భారీ చిత్రాలు థియేటర్లన్నింటినీ ఆక్రమించుకోవడంతో.. చిన్న సినిమాలు తమ విడుదలలను వాయిదా వేసుకోవాల్సిన లేదా ఒకే ఒక్క షోతో సర్దుకుపోవాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా చిన్న సినిమాలకు కేవలం ప్రేక్షకుల మద్దతు మాత్రమే సరిపోదని, వ్యవస్థ, ప్రభుత్వాల నుంచి కూడా గట్టి ఆదరణ లభించాలని మనోజ్ తెలిపారు. చిన్న చిత్రాలకు ఆర్థిక సహాయం కంటే కూడా, అవి ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు కనీస స్క్రీన్ల గ్యారెంటీ కల్పించే చట్టపరమైన రక్షణ అవసరమన్నారు.

Next Story