ఏది సాంకేతికత.. ఏది సంకేతం..? మనసును అర్థం చేసుకునే టెక్నాలజీ ఉందా?

by Javid Pasha |

బిడ్డకు జ్వరం వస్తే.. ఎక్కడో దూరాన ఉన్న తల్లి మనసు శంకిస్తుంది. ప్రియమైన దగ్గర లేకున్నా మన మనసులోని భావన ఎలా తెలుస్తుంది?

ఏది సాంకేతికత.. ఏది సంకేతం..? మనసును అర్థం చేసుకునే టెక్నాలజీ ఉందా?
X

దిశ, ఫీచర్స్ : కంటికి కనబడేది. రుజువుకు నిలబడేదే వాస్తవం అంటుంటారు పెద్దలు. కానీ కంటికి కనిపించని అదృశ్య సంకేతాలు కూడా కొన్నుంటాయని మీకు తెలుసా? వాటిలో కొన్నింటిని కనుగొని, సాంకేతిక రూపంలోకి మార్చడంలో సైన్స్ ఇప్పటికే సక్సెస్ సాధించింది. ఉదాహరణకు రేడియో తరంగాలు, స్మార్ట్‌ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్, వైఫై, బ్లూటూత్ సిగ్నల్స్ వంటివి ఈ కోవకు చెందినవని చెప్పవచ్చు. ఇవేవీ మన కంటికి కనిపించవు. కానీ ఏదో ఒక రూపంలో మన ఆలోచనలను, మన సందేశాలను ప్రభావితం చేస్తాయి. మన సందేశాలను గాలిలో ప్రసారం చేస్తాయి. ఈ అదృశ్య సంకేతాలనే మనం ‘సాంకేతికత’గా స్వీకరిస్తాం. కానీ మానవ శరీరం, మనసు కూడా ఇలాంటి ఈ తరహా అదృశ్య సంకేతాలనే కలిగి ఉందంటే మాత్రం మనలో చాలామంది నమ్మరు. పైగా అన్‌సైంటిఫిక్ అని కొట్టిపారేస్తుంటారు.

మనకు కనబడనిదంతా వాస్తవం కాదని నమ్మడంలో తప్పులేదు కానీ.. మనకు కనబడని అదృశ్య సంకేతాలు లేదా సాంకేతికత కూడా ఉండవచ్చుననే వాదనను మాత్రం తోసిపుచ్చలేం అంటుంటారు కొందరు పెద్దలు. ఇది సాంకేతికతకు ఆవల, ఎవరికీ అంతుపట్టని విషయమై కూడా ఉండవచ్చు. ముఖ్యంగా మావన శరీరం, మనసు, మనసుల మధ్య అనుబంధాలు ఈ అదృశ్య సంకేతాలు లేదా సాంకేతికత అనడమేమీ అతిశయోక్తి కాదంటున్నారు కొందరు నిపుణులు. గాలిలో ప్రసారం అయ్యే ఇంటర్నెట్ లేదా స్మార్ట్‌ఫోన్ సిగ్నల్స్ లేదా రేడియో తరంగాలు కంటికి కనబడవు. కానీ ఇవి మన ఆలోచనలను, సందేశాలను గాలిలో ప్రసారం చేస్తాయి. ఈ అదృశ్య సాంకేతిక సంకేతాలను ‘టెక్నాలజీ’గా స్వీకరిస్తాం. కానీ.. మనుషుల మధ్య మనసుల్లో ఉద్భవించే అనుభూతి సంకేతాలను, ప్రేమాను రాగాలను, అవి విడుదల చేసే సంకేతాలను మాత్రం తేలిగ్గా తీసుకుంటాం. ఎందుకు?

గాలిలో తిరుగాడే సిగ్నల్స్ మాదిరిగానే, మనుషుల మనసులు, శరీరాలు కూడా కొన్ని సంకేతాలు విడుదల చేస్తాయనే విషయాన్నే మనలో చాలామంది పట్టించుకోరు. పైగా అలాంటి ఆలోచనే అర్థరహితమని కొట్టిపారేస్తారు. కానీ నిజానికి మనుషులమైన మనలో కూడా మనకే అర్థం కానీ లేదా మనమే గుర్తించలేని అద్భుతమైన అనుభూతినిచ్చే అదృశ్య సంకేతాలు(సాంకేతికత) ఉంటాయని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. అయితే ఈ ఆలోచనను సాంప్రదాయ సైన్స్ “unscientific” అని కొట్టి పారేస్తుందని కూడా చెబుతుంటారు. అలా కాకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనషి శరీరం, మనిషి మనసులో కూడా ఏదో అద్భుతమైన సాంకేతికత దాగి ఉండొచ్చు. అదే కనబడని అదృశ్య శక్తి అని ఎందుకు అనుకోకూడదు అంటుంటారు పలువురు నిపుణులు.

ఎక్కడో దూరాన ఉన్న ప్రియమైన వ్యక్తిని చూడాలని పదే పదే మనసు ఎందుకు కలవరిస్తుంది? సరిగ్గా మీ మనసులో వారిని చేసుకున్నప్పుడో, మీకు వారిపై మనసు లాగినప్పుడో అలా ఎక్కడో దూరాన ఉన్న వ్యక్తి మనసులో కూడా మీ గురించి ఏదో ఆలోచన ఎందుకు తిరుగుతుంది? మనసులో తెలియని అలజడి ఎందుకు చెలరేగుతుంది? ఇది ఎవరూ గుర్తించలేని రహస్య సంకేతం కావచ్చు బహుశా! కావాలంటే ఏ ప్రేమికులనో, ప్రాణ స్నేహితులనో అడిగి చూడండి. అంతెందుకు వేరే ఊరిలోనో, సిటీలోనో దూరాన ఉన్న తన బిడ్డకు జ్వరం వస్తే.. మరోచోట ఉన్న తల్లి మనసులోనో, తండ్రి మనసులోనో కీడు శంకిస్తుంది. ఆ వెంటనే కొన్ని క్షణాలో, కొన్ని నిమిషాలో, కొన్ని గంటలో ఎప్పుడైతేనేం.. బాగున్నవా బిడ్డా అని ఫోన్ వస్తుంది. బిడ్డకు ఏదో జరిగిందనే సంకేతం తల్లి/తండ్రి మనసుకు ఎలా అందుతుంది? మనిషిలో కూడా అదృశ్య సంకేతమో, అదృశ్య శక్తినో ఉన్నట్లే కదా.. కానీ కంటికి కనబడదు. సైన్స్ నమ్మదు.. ఎందుకంటే ఇది మనసు సంకేతం. మనిషి సంకేతం. మనుషుల మధ్య ముడివడిన అనుబంధాల అదృశ్యం సంకేతం. అర్థం చేసుకోవాలంతే..! సంకేతమో, సాంకేతికతో కానీ.. కొన్ని కంటికి కనబడవు.. అనూభూతినిస్తుంటాయి!!

Next Story