- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ పేరు చెప్పి పేదల ఇండ్లు కూల్చొద్దు : కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

దిశ, శంషాబాద్: పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసాన్ని చూస్తే మహాత్మా గాంధీ ఆత్మ కూడా ఘోషిస్తుందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి నమ్మేది గాడ్సేనని, అలాంటి వ్యక్తి మహాత్మా గాంధీ విగ్రహం పెడతానని చెప్పడం దొంగ మాటలేనని విమర్శించారు. గాంధీపై నిజమైన ప్రేమ ఉంటే పేదల ఇండ్లను కూల్చకుండా కాపాడాలని సూచించారు. మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసపు రాజకీయాలు చేస్తోందని, ఈ చర్యలకు బీజేపీ కూడా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడుకుని "చోటే భాయ్–బడే భాయ్"లా రేవంత్ రెడ్డి, మోదీ ఇద్దరూ కలిసి నిరుపేదల ఇండ్లను కూల్చి మూసీ భూములను కొల్లగొడుతున్నారని విమర్శించారు. మోదీకి నిజాయితీ ఉంటే పేదల భూములు లాక్కోవద్దని, వారికి అన్యాయం చేయవద్దని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. స్థానికంగా బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా, వారి సొంత ప్రభుత్వం మాత్రం ఇండ్లు కూల్చేందుకు అనుమతులు ఇస్తోందని అన్నారు. గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయితే రేవంత్ రెడ్డి ఫ్లాప్ సినిమా అని ఈ సందర్భంగా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఒక్క హామీ నెరవేర్చలే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చేందుకు డబ్బులు లేవని చెబుతోందని, అదే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు కోసం మాత్రం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రకాష్ గౌడ్‌పై విమర్శలు
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి పేరుతో పార్టీ మారిన ప్రకాష్ గౌడ్ గత రెండున్నరేళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఎంతమంది పెద్ద నాయకులు పార్టీని వీడినా గులాబీ సైన్యం బలంగానే ఉందని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కార్తీక్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






