FIH నేషన్స్‌ కప్‌ ఛాంపియన్‌గా భారత మహిళల హాకీ జట్టు.. కివీస్‌పై ఘన విజయం

by Ramesh Naini |

భారత మహిళల హాకీ జట్టు అంతర్జాతీయ వేదికపై మరోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.

FIH నేషన్స్‌ కప్‌ ఛాంపియన్‌గా భారత మహిళల హాకీ జట్టు.. కివీస్‌పై ఘన విజయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత మహిళల హాకీ జట్టు అంతర్జాతీయ వేదికపై మరోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. న్యూజిలాండ్‌ వేదికగా ఆదివారం ఆక్లాండ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఎఫ్‌ఐహెచ్ (FIH) మహిళల నేషన్స్ కప్’ ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను 2-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి భారత్ ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో భారత జట్టు వచ్చే సీజన్ ‘ఎఫ్‌ఐహెచ్ మహిళల ప్రొ లీగ్’కు అర్హత సాధించి, తిరిగి ఎలైట్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. భారత్‌కు ఇది రెండో నేషన్స్ కప్ టైటిల్ (తొలి టైటిల్ 2022లో వచ్చింది).

మెరుపు గోల్స్.. పటిష్టమైన డిఫెన్స్

మ్యాచ్ ప్రారంభమైన 4వ నిమిషంలోనే నవ్‌నీత్ కౌర్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు తొలి ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత 15వ నిమిషంలో సునేలితా టొప్పో మరో సూపర్‌ గోల్‌ చేయడంతో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పుంజుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత డిఫెండర్లు, గోల్‌కీపర్ సవితా పూనియా ప్రత్యర్థి వ్యూహాలను అద్భుతంగా తిప్పికొట్టారు. ఇక, ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన లాల్రేమ్‌సియామి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, టోర్నమెంట్‌లో మొత్తం 6 గోల్స్ చేసిన దీపిక సంయుక్త టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. గ్రూప్ దశలో అమెరికా, జపాన్, ఉరుగ్వేలను ఓడించిన భారత్.. సెమీఫైనల్లో చిలీని 6-0తో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చింది.

క్రీడాకారిణులపై నగదు బహుమతుల వర్షం

భారత మహిళల జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తింపుగా హాకీ ఇండియా (HI) భారీ నగదు బహుమతులను ప్రకటించింది. జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు, అలాగే సపోర్ట్ స్టాఫ్ సభ్యులకు రూ.1.5 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.

Next Story