నగర పాలక సంస్థలో సంపూర్ణంగా స్పెషల్ డ్రైవ్

by Taduka Kalyani |

వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదివారం తెలిపారు.

నగర పాలక సంస్థలో సంపూర్ణంగా స్పెషల్ డ్రైవ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జూన్ 21: వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించడం జరిగిందని, ప్రతి రోజు సగటున రెండు నుండి మూడు డివిజన్లలో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య పనులను చేపట్టి పూర్తి చేశామన్నారు. ఆయా డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే, నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్చందంగా భాగస్వాములయ్యారని అన్నారు. ఒక్కో సర్కిల్ పరిధిలోని సానిటేషన్ కార్మికులు సుమారు వంద మంది చొప్పున సామూహికంగా పారిశుధ్య పనులను చేపట్టడం వల్ల ఆయా డివిజన్లలో సానిటేషన్ పనులు పెద్ద ఎత్తున చేపట్టగలిగామని తెలిపారు. డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను తరలించడం, పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలను శుభ్రం చేయడం వంటి పనులు అన్ని డివిజన్లలో పూర్తయ్యాయని అన్నారు. శుభ్రపరచిన మురుగును, చెత్తను నివాస ప్రాంతాల మధ్య నుండి వెంటదివెంట తరలించడం జరిగిందన్నారు. కలెక్టర్ చొరవతో పలు డివిజన్లలో శ్రమదానం కార్యక్రమాలు సైతం జరిగాయని అన్నారు. వర్షాకాలంలో వర్షపు జలాలు నిలువ ఉండకుండా ఆయా నివాస ప్రాంతాలలోని మురుగు కాలువల్లో పూడికతీత పనులను కూడా వేగవంతంగా జరిపిస్తున్నామని కమిషనర్ తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్తాచెదారం మురుగు కాలువల్లోకి చేరి, పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు, ప్రధాన రహదారులు అపరిశుభ్రంగా మారే అవకాశం ఉన్నందున ప్రణాళికాబద్దంగా డీసిల్టింగ్ పనులు చేయిస్తున్నామని అన్నారు. అవకాశం ఉన్న చోట జేసీబీల ద్వారా, మిగితా చోట్ల పారిశుధ్య కార్మికులతో పూడికతీత పనులు జరిపిస్తున్నామని తెలిపారు. ఐదు జోన్ల పరిధిలో దాదాపు 23 కిలోమీటర్ల పొడవుతో కూడిన స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు ఉండగా, రూ. 68.96 లక్షల రూపాయల అంచనా వ్యయంతో డీసిల్టింగ్ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 17.22 కిలోమీటర్ల పొడవుతో కూడిన డ్రైనేజీల డీసిల్టింగ్ పూర్తయ్యిందని వివరించారు. మిగితా డీసిల్టింగ్ పనులను కూడా వారం పది రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

Next Story