- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతరం ‘నజర్’ను నమ్ముతుందా?
మీ అమ్మ ఎప్పుడైనా ఫంక్షన్‌కు వెళ్లేటప్పుడో, బయటకు వెళ్తున్నప్పుడో మీ చెవి వెనకనో, పాదానికో కాటుక పెట్టిందా? మీ నానమ్మ మీకు మంచి మార్కులు వచ్చినప్పుడో, గొప్ప ఉద్యోగం వచ్చినప్పుడో దిష్టి తగులుద్ది బిడ్డా అని దిష్టి తీసిందా?

దిశ, ఫీచర్స్ : మీ అమ్మ ఎప్పుడైనా ఫంక్షన్‌కు వెళ్లేటప్పుడో, బయటకు వెళ్తున్నప్పుడో మీ చెవి వెనకనో, పాదానికో కాటుక పెట్టిందా? మీ నానమ్మ మీకు మంచి మార్కులు వచ్చినప్పుడో, గొప్ప ఉద్యోగం వచ్చినప్పుడో దిష్టి తగులుద్ది బిడ్డా అని దిష్టి తీసిందా? నల్లటి దారం కట్టుడో, ఉప్పు-మిరప కాయలు కలిపి దిష్టి తీసుడో, నజర్ నుంచి బయట పడేందుకు చిన్న చిన్న ఆచారాలేవో చేసిందా? ఇవి భారతీయుల రోజువారీ జీవితంలో భాగమే. కానీ చాలా కాలం పాటు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టేశారు. అయితే యువతరం మాత్రం నజర్, ఆరా శుద్ధి, క్రిస్టల్స్ వంటి ఆధ్యాత్మికత గురించి చర్చిస్తుంది. నమ్ముతుంది. దీన్ని మానసిక శ్రేయస్సు, వ్యక్తిగత సరిహద్దులు, చుట్టుపక్కల ప్రభావాలను అర్థం చేసుకునే విధానంలో విస్తృత మార్పుగా చెప్తుంది.
ఈ మార్పు ఎందుకు?
నిజానికి కొన్ని పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు తమ మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతారో ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు. ప్రతి సంభాషణా ఒకేలా అనిపించదని చాలా మంది గమనించడం మొదలుపెట్టారు. కొందరు ప్రేరణ ఇచ్చి ఉన్నత్తి వైపు నడిపిస్తే.. మరికొందరు మానసికంగా అలసట, భావోద్వేగ బలహీనతను మిగులుస్తారు. దీని కారణంగానే చాలా మంది యువత ఆధ్యాత్మిక రక్షణను కోరుకుంటుందని.. అవగాహనను పెంచుకుంటుందని చెప్తున్నారు నిపుణులు.
నజర్ నిజమేనా?
నజర్ లేదా దృష్టి దోషం అనే భావన భారతీయ సంస్కృతిలో తరాల తరబడి ఉంది. పిల్లలకు నల్లటి బొట్టు పెట్టడం, ఇంటికి పవిత్ర చిహ్నాలు, యంత్రాలు వేలాడదీయడం, ఉప్పు, పొగతో దిష్టి తీయడం వంటి ఆచారాలు సాధారణంగా జరుగుతాయి. ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం.. ఈ ఆచారాలు మానవ ఆలోచనలు, ఉద్దేశాలు శక్తిని కలిగి ఉంటాయనే నమ్మకంపై ఆధారపడి ఉన్నాయి. ‘ఈర్ష్య శక్తి. ద్వేషం శక్తి. ఆకర్షణ కూడా శక్తి. దృష్టి కూడా శక్తే’ అని నమ్ముతారు. ఆధునిక మనస్తత్వ శాస్త్రం దీనిని భావోద్వేగ ప్రభావాలు, సామాజిక డైనమిక్స్ ద్వారా వివరించవచ్చు కానీ అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు దీన్ని శక్తి మార్పిడి కోణంలో చూస్తాయి.
అలసట.. శక్తి రక్షణ
ఏదో ఒక శక్తి తమను రక్షిస్తుందనే ఆసక్తి యువతలో పెరగడానికి కారణం ఆధునిక జీవన విధానమే. మునుపటి తరాలు నెమ్మదైన జీవితం, బలమైన సమాజ బంధాలు, ప్రకృతితో ఎక్కువ సమయం గడపడం వల్ల లాభపడ్డారు. ఆధునిక జీవితం మాత్రం మనుషులను అతిగా ప్రేరేపించి, భావోద్వేగ అలసటకు గురి చేస్తోంది. మానవాళి శక్తి స్థాయిలో అతిగా ఉత్తేజితమైంది. ఆత్మ ఇప్పుడు రక్షణను కోరుతోంది. అందుకే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తోంది. ఆధ్యాత్మిక వృద్ధిని కోరుకుంటోంది. అంటే ఏ సంబంధాలు, పరిస్థితులు, పరిసరాలు మన జీవితానికి సానుకూలంగా ఉంటాయో, ఏవి భావోద్వేగ ఒత్తిడిని కలిగిస్తాయో గుర్తిస్తుంది. ఆధ్యాత్మికంగా అవగాహన ఉన్న వ్యక్తి ఇలాంటి వాటిని గుర్తిస్తాడు. ఫాలో అవుతాడు. నిరంతరం శక్తిని హరించే వ్యక్తులు.. అంటే భావోద్వేగాలను మానిప్యులేట్ చేసే వారిని.. ప్రతికూలతను ప్రసారం చేసే వారిని.. విజయ సమయంలో మాత్రమే కనిపించే వారిని.. భావోద్వేగ అలసటను మిగుల్చే వారికి దూరంగా ఉంటాడు.
దృష్టి దోషాలు ఎందుకు ట్రెండ్?
దృష్టి దోష బ్రేస్‌లెట్స్ నుంచి క్రిస్టల్ సేకరణల వరకు ఆధ్యాత్మిక సాధనాలు ఆన్‌లైన్, వెల్‌నెస్ సమూహాలలో ప్రముఖత పొందుతున్నాయి. అయితే నిపుణులు ఇలాంటి ఆచారాలు కొత్తవి కావని చెబుతారు. ప్రాచీన ఈజిప్టు వాసులు రక్షణా చిహ్నాలు ఉపయోగించేవారు. తాంత్రిక సంప్రదాయాలు యంత్రాలు, మంత్రాలపై ఆధారపడేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రక్షణ, స్పష్టత, ఆధ్యాత్మిక సమతుల్యం కోసం చిహ్నాలు, ఆచారాలను ఉపయోగించేవారు. ఇది కేవలం ట్రెండ్ కాదు శక్తి రక్షణ, సరిహద్దులు నిర్ణయించుకోవడం, భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి భావనలు మెయిన్‌స్ట్రీమ్ సంభాషణల్లోకి వచ్చేశాయి. ఆధ్యాత్మిక రక్షణ అంటే భయం కాదు అవగాహన అనేది అర్థమైంది. చాలా మందికి నజర్, క్రిస్టల్స్, శక్తి రక్షణపై ఆసక్తి కేవలం ట్రెండ్ కాదు అత్యంత ఒత్తిడి ఉన్న ప్రపంచంలో నిలకడ, రక్షణ, భావోద్వేగ సమతుల్యం కోసం వారు వెతికే మార్గం.






