కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే రెండోవ ‘ట్రయల్ రన్’..

by Kodari Anjali |

హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ & ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆదివారం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం రెండో వన్‌వే ట్రయల్ రన్ చేపట్టింది.

కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే రెండోవ ‘ట్రయల్ రన్’..
X

దిశ, జూబ్లీహిల్స్: హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ & ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టు నిర్మాణ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆదివారం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం రెండో వన్‌వే ట్రయల్ రన్ చేపట్టింది. ఇక్కడ జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనులను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ ట్రయల్ రన్‌ను నగర పోలీస్ కమిషనర్ వీ.సీ సజ్జనర్ ఆదివారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్, డీసీపీ కాజల్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణా రెడ్డి, తదితర అధికారులతో కలిసి కేబీఆర్ పార్కు మెయిన్ గేట్, బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలింనగర్, రోడ్ నంబరు 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు గల ప్రధాన కూడళ్లను సందర్శించి, వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ... భవిష్యత్తులో పెరగనున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రయల్ రన్ చేపట్టినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. గతంలో ఏప్రిల్ 5వ తేదీ (ఆదివారం) నాడు రెండు గంటల పాటు మొదటి ట్రయల్ రన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు.

సరికొత్త వన్‌వే విధానం వల్ల..

అప్పుడు గమనించిన లోపాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు రెండో వన్‌వే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రయల్ రన్ ఆదివారం రాత్రి 8 గంటల వరకే కొనసాగుతుందని సీపీ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతాయన్నారు. ట్రయల్ రన్ సమయంలో తలెత్తే ఇబ్బందులపై నిరంతరం అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. కేబీఆర్ పార్కు పరిసరాల్లో సుమారు 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు రాబోతున్నాయని సీపీ వివరించారు. ఈ సరికొత్త వన్‌వే విధానం వల్ల ప్రయాణ దూరం స్వల్పంగా పెరుగుతుందన్నారు. అయితే, ఎక్కడా ట్రాఫిక్ జామ్‌లు లేకుండా సాఫీగా ప్రయాణించవచ్చని చెప్పారు. వాహనదారులు రోడ్లపై అకస్మాత్తుగా లేన్లు మార్చడం వల్ల కొంత గందరగోళం ఏర్పడుతోందన్నారు. అందువల్ల పోలీసులు జారీ చేసే అడ్వైజరీలు, సూచిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని కోరారు. రోడ్లపై పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులను త్వరగా ముగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం డ్రోన్ల ద్వారా..

అలాగే ఈ మార్గంలో ఉన్న ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. అంబులెన్సుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ట్రయల్ రన్ సమయంలో వాహనాలు లేన్లు మారే చోట కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు గుర్తించామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. ఈ విధానాన్ని శాశ్వతంగా అమలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వాహనాలు సులభంగా లేన్లు మారడానికి వీలుగా చెక్‌పోస్టు - కేబీఆర్ పార్కు మధ్య 150 మీటర్ల 'ఇంటర్ చేంజ్' స్థలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు వద్ద పెడెస్ట్రియన్ సిగ్నళ్ల ఏర్పాటుపై నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా ఈ జంక్షన్లలో ట్రాఫిక్ విధానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాతే ఇక్కడ శాశ్వత మార్పులు చేపడతామని స్పష్టం చేశారు. నగర ప్రగతికి, సాఫీ ప్రయాణానికి ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Next Story