- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చాలి : CMకు జాన్ వెస్లీ లేఖ
నాలుగు రాష్ట్రాల సరిహద్దులోని పేదలు, ముఖ్యంగా గిరిజన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని.. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నాలుగు రాష్ట్రాల సరిహద్దులోని పేదలు, ముఖ్యంగా గిరిజన (ఆదివాసీ) ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని.. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. జూన్ 10న తేదీన తమ పార్టీ నాయకత్వంతో కలిసి భద్రాచలం ఆసుపత్రిని సందర్శించామని, ఆ సమయంలో మౌలిక, సిబ్బంది లోపాలను గమనించినట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని దాదాపు 80 శాతం మంది ఆదివాసీలు ఈ ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారని, అయినా ఐటీడీఏ నిధులు దీనికి కేటాయించడం లేదని లేఖలో పేర్కొన్నారు.
62 మంది డాక్టర్లకు 22 మందే!
ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని జాన్ వెస్లీ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 62 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 22 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని తెలిపారు. 16 మంది సివిల్ సర్జన్లకు గాను ముగ్గురే ఉన్నారని, 37 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లలో మెజారిటీ కాంట్రాక్ట్ వారేనని, అందులోనూ ఆరుగురు డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారని వివరించారు. ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ (పిల్లల వైద్యం), ఈఎన్‌టీ విభాగాల్లో సగం మంది కూడా లేరని, ఆయుర్వేదం, హోమియో, జనరల్ మెడిసిన్, స్కిన్ విభాగాల్లో అసలు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరని పేర్కొన్నారు.
మూడు వార్డులకు ఒక్కరే నర్సు!
వైద్యులతో పాటు నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కొరత కూడా వేధిస్తోందని వెస్లీ తెలిపారు. 53 మంది నర్సింగ్ సిబ్బందికి కేవలం 28 మందే ఉన్నారని, చిల్డ్రన్స్ ఐసీయూలోనూ తీవ్ర కొరత ఉందన్నారు. ఒక్కో స్టాఫ్ నర్స్ ఏకంగా మూడు వార్డులను చూసుకోవాల్సి వస్తోందని, దీనివల్ల వారిపై తీవ్ర పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు, రేడియాలజీ విభాగానికి అసలు టెక్నీషియన్లే లేరని స్పష్టం చేశారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచే శానిటేషన్ వర్కర్లు 160 మంది ఉండాల్సి ఉంటే, కేవలం 85 మందితోనే సరిపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. పెరిగిన పనిభారానికి తగ్గట్టుగా కాకుండా వారికి కేవలం రూ.11 వేల కనీస వేతనం మాత్రమే ఇస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు.
పడకల కొరత.. రిపేరులోనే అంబులెన్స్
ఆసుపత్రి సామర్థ్యం 200 పడకలదే అయినప్పటికీ, నిత్యం 250 మందికి పైగా రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారని జాన్ వెస్లీ తెలిపారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ లేకపోవడం వల్ల రెండు అంబులెన్స్‌లలో ఒకటి గత రెండేళ్లుగా రిపేరులోనే మగ్గుతోందని సీఎం దృష్టికి తెచ్చారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రాచలం ఆసుపత్రిని తక్షణమే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సింగ్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని, అత్యవసర మందులు, ఆధునిక యంత్రాలను సరఫరా చేయాలన్నారు. శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచడంతో పాటు, అత్యంత కీలకమైన అడ్వాన్స్ ట్రామా సెంటర్‌ను భద్రాచలంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.






