- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు పై త్వరలో నిర్ణయం : ఎమ్మెల్సీ కోదండరాం
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశం పై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు.

దిశ, మహాబూబాబాద్ ప్రతినిధి : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశం పై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ జిల్లా స్థాయి సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారుల సమస్యలు, విన్నపాలను గుర్తింపు కమిటీ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తానన్నారు. వేలాది మంది త్యాగాలు, బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొంటూ, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరగకూడదన్నారు. 1969 ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు పోరాడిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని కోరారు.
ఉద్యమకారుల పై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జర్నలిస్టులను కూడా ఉద్యమకారులుగా గుర్తించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పై కొందరు పొరుగు రాష్ట్రాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన కోదండరాం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మంచివి కావన్నారు. అలాగే గోదావరి, కృష్ణా జలాల పంపిణీ, పోతిరెడ్డిపాడు, పోలవరం వంటి అంశాల్లో తెలంగాణ హక్కులకు అనుగుణంగా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్, పిల్లి సుధాకర్, శాంతన్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.






