చికెన్‌గున్యాకు ఆవు మూత్రంతో చెక్.. ఐఐటీ రూర్కీ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

by Thanuru Gopichand |   (  Updated:2026-06-21 19:30:50  IST  )

గోమూత్రంతో చికెన్‌గున్యా వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని ఉత్తరాఖండ్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ పరిశోధకులు వెల్లడించారు.

చికెన్‌గున్యాకు ఆవు మూత్రంతో చెక్.. ఐఐటీ రూర్కీ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి
X

దిశ, నేషనల్ బ్యూరో: గోమూత్రంతో చికెన్‌గున్యా వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని ఉత్తరాఖండ్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ పరిశోధకులు వెల్లడించారు. ఆవు మూత్రం డిస్టిలేట్ లో ఉండే కొన్ని బయో-యాక్టివ్ సమ్మేళనాలు చికెన్‌గున్యాకు వ్యతిరేకంగా అద్భుతమైన యాంటీవైరల్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ప్రయోగశాల పరిస్థితులలో కేవలం ఆవు మూత్రం డిస్టిలేట్‌ను ఉపయోగించడం ద్వారా వైరల్ లోడ్‌లో 90 శాతం కంటే ఎక్కువ తగ్గుదల కనిపించిందని, అలాగే దీని ఆధారంగా తయారుచేసిన సహజ ఫార్ములేషన్ ద్వారా ఏకంగా 99.85 శాతం వరకు వైరస్ తగ్గినట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు..

అయితే సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ పరిశోధన ఫలితాలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ అధ్యయనాన్ని 'సుడోసైన్స్' (కల్పిత సైన్స్) గా కొట్టిపారేస్తూ.. ఆవు మూత్రంలోనే ఇలాంటి గుణాలు ఉంటే, దానికి దగ్గరి జాతులైన గేదెలు, జింకల మూత్రంలోనూ ఇవి ఉంటాయా? అంటూ ఐఐటీ రూర్కీని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులకు మద్దతు ఇచ్చే మరికొందరు నెటిజన్లు.. ప్రాచీన నమ్మకాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఇప్పుడు ఆధునిక పరిశోధనల ద్వారా నిరూపితమవుతున్నాయని సమర్థిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో కేవలం ఒక్క రోజులోనే 4 లక్షలకు పైగా వీక్షణలు సాధించిన ఈ పరిశోధన పోస్ట్‌కు ఐఐటీ రూర్కీ తన 'ఎక్స్' ఖాతాలో కామెంట్ల సెక్షన్‌ను నియంత్రించింది.

Next Story