భారత్‌తో యుద్ధానికైనా సిద్ధం అంటున్న పాకిస్థాన్‌.. ఏ విష‌యంలో అంటే?

by Thanuru Gopichand |   (  Updated:2026-06-21 18:22:09  IST  )

సింధు జలాల ఒప్పందం పరిధిలోని నదీ ప్రవాహాలపై ఇరుదేశాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. తమ దేశ నీటి భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లితే భారత్‌పై యుద్ధానికైనా వెనుకాడబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

భారత్‌తో యుద్ధానికైనా సిద్ధం అంటున్న పాకిస్థాన్‌.. ఏ విష‌యంలో అంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: సింధు జలాల ఒప్పందం పరిధిలోని నదీ ప్రవాహాలపై ఇరుదేశాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. తమ దేశ నీటి భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లితే భారత్‌పై యుద్ధానికైనా వెనుకాడబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ జాతీయ భద్రతలో నీరు కూడా ఒక భాగమేనని, నీటి సరఫరాకు ఆటంకం కలిగించేలా భారతదేశం అడుగులు వేస్తోందనే ఆధారాలు దొరికితే ఖచ్చితంగా సైనిక చర్యను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. జూన్ 2028 నాటికి పాకిస్థాన్‌కు వెళ్లే సింధు నది జలాలను పూర్తిగా నిలిపివేయవచ్చని భారత జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ వ్యాఖ్యానించిన వీడియో క్లిప్ వెలుగులోకి రావడంతో పాక్ రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, పాకిస్థాన్ ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం ఆపేంత వరకు 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో భారతదేశం నీటిని ఒక ఆయుధంగా వాడుకుంటూ, చీనాబ్ నది ప్రవాహాన్ని నియంత్రిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాలు తీవ్రమైన నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండటం, సుక్కూర్ బ్యారేజ్ పరిధిలో సాగునీటి కొరత వల్ల దేశంలో "ఆర్థిక విధ్వంసం" తప్పదని స్థానిక నేతలు హెచ్చరిస్తున్న తరుణంలో.. అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ప్రభుత్వం భారత్‌పై ఇలాంటి యుద్ధ హెచ్చరికలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story