రాధాగాయత్రి మృతికేసులో బిగ్ ట్విస్ట్..!

by Naga Rani Yarlagadda |

విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఎంప్లాయ్ సుధాకర్ - సత్యవతి దంపతుల కుమార్తె, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి మృతికేసులో బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

రాధాగాయత్రి మృతికేసులో బిగ్ ట్విస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఎంప్లాయ్ సుధాకర్ - సత్యవతి దంపతుల కుమార్తె, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి మృతికేసులో బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తన భార్యది సడెన్ డెత్ అని, తనకేం సంబంధం లేదన్న శ్రీచరణ్ పై ముస్సోరీ పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. తన కుమార్తె మరణం వెనుక అల్లుడు శ్రీచరణ్ హస్తం ఉందంటూ.. గాయత్రి తండ్రి సుధాకర్ నిన్న (శనివారం) ముస్సోరీ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఒక సైకో అని, అతని మానసిక వేధింపులు తట్టుకోలేకనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. సుధాకర్ ఫిర్యాదును పరిశీలించిన ముస్సోరీ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద శ్రీచరణ్ పై హత్యకేసు నమోదు చేశారు. కాగా.. పోలీసులకు చేసిన ఫిర్యాదులో తండ్రి సుధాకర్ 11 అంశాలను పేర్కొన్నారు. మరోవైపు డెహ్రాడూన్ లోనూ సుధాకర్ పోలీసులను కలిసి కుమార్తె అనుమానాస్పద మృతిపై ఫిర్యాదు చేశారు.

గతేడాది నవంబర్ 8న శ్రీచరణ్ తో రాధాగాయత్రి పెళ్లి జరగ్గా.. ఏడాది తిరగకుండానే ఒక్కగానొక్క కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముమ్మాటికీ అల్లుడు శ్రీచరణే తమ కూతురిని చంపేశాడని గట్టిగా ఆరోపిస్తున్నారు. కానీ.. శ్రీచరణ్ చెప్తున్న విషయాలు మరోలా ఉన్నాయి. కూతురిని పోగొట్టుకున్న బాధలో తనపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని, నిజాని గాయత్రి లేనిలోటు తనను తీవ్రంగా కలచి వేస్తోందని మీడియా ఎదుట వాపోయాడు. ముస్సోరీలో స్టే చేసిన హోటల్లో రెడ్ వైన్ తీసుకున్నామని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదంటున్నాడు. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని పోలీసులు ఆరా తీయగా.. అసలు తమ హోటల్లో ఆల్కహాల్ ను అనుమతించమని చెప్పడంతో.. శ్రీచరణ్ పైనే అనుమానాలు బలపడుతున్నాయి.

Next Story