- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి వివేక్‌పై ధరం గురువారెడ్డి విమర్శలు..
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, సికింద్రాబాద్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీసీఏ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సమావేశానికి అనుమతి నిరాకరించినప్పటికీ, నిజాలను అడ్డుకోలేరని పేర్కొన్నారు. దీంతో టీసీఏ నాయకులు రోడ్డుపైనే మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేయడం సరికాదని, తాము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రి వివేక్ ఇటీవల టీసీఏ ఎక్కడ ఉంది? అని చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన లేమికి నిదర్శనమని గురువారెడ్డి అన్నారు.
రూ.69 కోట్ల బదిలీ ప్రయత్నంపై...
2018లో వివేక్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే, అలాగే 2021లో కూడా టీసీఏతో కలిసి పనిచేయాలని బీసీసీఐ సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. హెచ్‌సీఏలో గత 15 ఏళ్లలో సుమారు రూ.600 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగాయని టీసీఏ ఇప్పటికే సీఐడీకి ఫిర్యాదు చేసిందని తెలిపారు. 2004 నుంచి 2026 వరకు హెచ్‌సీఏ వ్యవహారాలపై వివేక్ కుటుంబ ప్రభావం అధికంగా ఉందని, ఆయన సోదరుడు వినోద్ పలుమార్లు అధ్యక్షుడిగా, వివేక్ కీలక పదవుల్లో ఉన్న సమయంలోనే అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అలాగే హెచ్‌సీఏ నిధుల నుంచి విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.69 కోట్ల బదిలీ ప్రయత్నంపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. టీజీ20 లీగ్ నిర్వహణపై కూడా గురువారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లీగ్‌కు బీసీసీఐ అనుమతి ఉందని హెచ్‌సీఏ చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క అధికారిక అనుమతి పత్రాన్ని కూడా ప్రజల ముందుంచలేదని అన్నారు.
టీసీఏ ఫిర్యాదులపై...
తెలంగాణ ప్రజలను, యువ క్రికెటర్లను తప్పుదోవ పట్టించే విధంగా ఈ లీగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జిల్లాల పేరుతో నిర్వహిస్తున్న లీగ్‌లో జిల్లాలకు చెందిన క్రీడాకారులకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం లీగ్ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. తెలంగాణ క్రికెటర్ల భవిష్యత్తును పణంగా పెట్టి కొందరి వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ లీగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. టీసీఏ ఫిర్యాదులపై తెలంగాణ లోకాయుక్త ఇప్పటికే సీఐడీకి నిర్దిష్ట గడువులో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. హెచ్‌సీఏలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతి, ఆర్థిక అక్రమాలపై పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే వరకు న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ క్రికెటర్ల హక్కుల పరిరక్షణ, పారదర్శకమైన క్రికెట్ పరిపాలన కోసం టీసీఏ అన్ని చట్టపరమైన, ప్రజాస్వామ్య మార్గాల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని ధరం గురువారెడ్డి తెలిపారు.






