- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడుగురు మహిళలు మృతి.. అధికారులకు CM విజయ్ 24 గంటల డెడ్‌లైన్
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఆదివారం ఒక ప్రైవేట్ రొయ్యల ప్రాసెసింగ్ (సీఫుడ్ ఎక్స్పోర్ట్) ప్లాంట్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఆదివారం ఒక ప్రైవేట్ రొయ్యల ప్రాసెసింగ్ (సీఫుడ్ ఎక్స్పోర్ట్) ప్లాంట్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ప్రాసెసింగ్ యూనిట్ నుండి ఒక్కసారిగా అమ్మోనియా గ్యాస్ తీవ్రస్థాయిలో లీక్ కావడంతో ఊపిరాడక ఏడుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురై తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితుల్లో ఎక్కువమంది అస్సాం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. పెరియపాళెం సమీపంలోని మంజంకరణై వద్ద ఉన్న సదరు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ దారుణం జరిగింది. గ్యాస్ లీక్ అయిన సమయంలో ప్లాంట్ పరిసరాల్లోని వసతి గృహాల్లో కార్మికులు ఉన్నారు. క్షణాల వ్యవధిలో అమ్మోనియా గ్యాస్ ప్లాంట్ అంతటా వ్యాపించడంతో కార్మికులకు తీవ్ర శ్వాసకోస సమస్యలు తలెత్తాయి. పలువురికి నోరు, ముక్కు నుండి రక్తం రావడంతో పరిస్థితి భయాందోళనకరంగా మారింది. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం, స్థానికులు బాధితులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.
సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి..
ఈ ప్రమాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటన తెలియగానే వెంటనే స్పందించిన సీఎం.. తిరువళ్లూరు పర్యవేక్షణ మంత్రి, ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షించాలని మంత్రులు ఆధవ్ అర్జున, రాజ్ మోహన్లను ఆసుపత్రులకు పంపించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంపై 24 గంటల్లోగా మధ్యంతర నివేదికను, అలాగే మూడు రోజుల్లోగా పూర్తిస్థాయి తుది నివేదికను తమకు సమర్పించాలని అధికారులకు సీఎం విజయ్ కఠినమైన డెడ్‌లైన్ విధించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై పెరియపాళెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.






