నీట్ విద్యార్థినికి అండగా జనగామ పోలీసులు

by Batti.Sumithra |

నీట్ (NEET) ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని పొరపాటున తప్పుడు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది.

నీట్ విద్యార్థినికి అండగా జనగామ పోలీసులు
X

దిశ, జనగామ : నీట్ (NEET) ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని పొరపాటున తప్పుడు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే జనగామ జిల్లా పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి వారిని సకాలంలో అసలు పరీక్షా కేంద్రానికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే అశ్విని అనే విద్యార్థిని నీట్ పరీక్ష రాసేందుకు జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల కేంద్రానికి వచ్చింది. అయితే ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఓ కళాశాల అని హాల్‌టికెట్ పరిశీలించిన పోలీసులు గుర్తించారు. పరీక్ష సమయం సమీపిస్తుండటంతో విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురై కన్నీటి పర్యంతమైంది. వెంటనే విధుల్లో ఉన్న ఎస్ఐలు భారత్, రతిష్, చెన్నకేశవులు ఈ విషయాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.

పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న డీసీపీ వెంటనే విద్యార్థినిని అసలు పరీక్షా కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. డీసీపీ ఆదేశాల మేరకు ఎస్ఐ చెన్నకేశవులు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో తీసుకుని జనగామ నుంచి పెంబర్తి వరకు వేగంగా ప్రయాణించి పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే సురక్షితంగా కేంద్రానికి చేర్చారు. దీంతో విద్యార్థిని ఊపిరి పీల్చుకుని పరీక్షకు హాజరైంది. సమయానికి స్పందించి విద్యార్థిని విద్యా సంవత్సరం వృథా కాకుండా కాపాడిన ఎస్ఐ చెన్నకేశవులును, సీఐలు సత్యనారాయణ రెడ్డి, అబ్బయ్యతో పాటు పోలీసు సిబ్బందిని అక్కడున్న విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. ఆపద సమయంలో జనగామ పోలీసులు చూపిన మానవీయ స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. "పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షకులే కాదు.. అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలిచే ఆపద్బాంధవులు కూడా" అని పలువురు అభిప్రాయపడ్డారు.

Next Story