​ఈనెల 24న ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముట్టడి

by Batti.Sumithra |

గ్రామపంచాయతీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ తెలిపారు.

​ఈనెల 24న ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముట్టడి
X

దిశ, ​హుజూరాబాద్ రూరల్ : గ్రామపంచాయతీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ తెలిపారు. ఆదివారం హుజూరాబాద్ మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం రవీందర్ రావు అధ్యక్షతన జరిగింది. ​ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొప్పుల శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా, గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక విస్మరించారని మండిపడ్డారు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చలనం లేకపోవడం దారుణమన్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

​పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలి.

​పీఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలి.

​ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించేలా శాశ్వత జీవో జారీ చేయాలని ఆయన కోరారు.

ప్రభుత్వ ప్రకటనలు అబద్ధం.. కార్మికుల కడుపు కోత నిజం !

​పల్లెలను శుభ్రంగా ఉంచుతూ, ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న పంచాయతీ కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వం ఇచ్చేదే 9,500 అరకొర వేతనం. దానిని కూడా ప్రతి నెల ఇవ్వకుండా 2 నెలల నుంచి 6 నెలల కొకసారి చెల్లిస్తూ కార్మికులను ఆకలితో అలమటించేలా చేస్తున్నారని, కానీ, మీడియాలో మాత్రం ప్రతి నెల ఒకటో తారీఖున వేతనాలు ఇస్తున్నామని, రూ.50 కోట్ల బడ్జెట్ కేటాయించామని భారీ ప్రకటనలు ఇస్తూ ప్రభుత్వం ప్రజలను, కార్మికులను మోసం చేస్తోంది" అని ఆయన ఆరోపించారు.

సమస్యలు పరిష్కరించకుంటే 'చలో ప్రజా భవన్'

​రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశలవారీగా ఆందోళనలు చేపడుతున్నామని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో 'చలో ప్రజాభవన్' ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కాశిపాక శంకర్, ఎలుకపెల్లి సారయ్య, కమిటీ సభ్యులు వడ్లూరి లక్ష్మీనారాయణ, బోయిని స్వరూప, రుద్రారం నాంపల్లి, రామగిరి మల్లయ్య, బండ సమ్మయ్య, ఎల్లయ్య, ఇమ్మటి శ్రీకాంత్, చొప్పదండి భిక్షపతి, ఆకునూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story