వైభవ్ విధ్వంసం.. ముక్కోణపు సిరీస్ ఛాంపియన్‌గా ఇండియా A

by Ramesh Naini |

శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా ‘A’ జట్టు ఘన విజయంతో టైటిల్‌ను సొంతం చేసుకుంది.

వైభవ్ విధ్వంసం.. ముక్కోణపు సిరీస్ ఛాంపియన్‌గా ఇండియా A
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా ‘A’ జట్టు ఘన విజయంతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో శ్రీలంక ‘A’పై 66 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటింది. టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ‘A’ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కేవలం 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా తిలక్ వర్మ 67 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, రుతురాజ్ గైక్వాడ్ (40), ప్రియాంశ్ ఆర్య (39), అనుకుల్ రాయ్ (39), కుమార్ కుశాగ్ర (36), విప్రాజ్ నిగమ్ (27) పరుగులతో జట్టుకు బలమైన పునాది వేశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక

378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టు భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనకు తలొగ్గింది. 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది. వనుజ సహన్ 62, సదీర సమరవిక్రమ 52 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. విజయకాంత్ వియాస్కాంత్ (39), సహన్ అరచ్చిగే (38), నిరోషన్ డిక్వెల్లా (25) కొంత ప్రతిఘటన చూపినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ తలా మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. అనుకుల్ రాయ్ రెండు వికెట్లు సాధించగా, అశోక్ శర్మ, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్, బౌలర్ల సమిష్టి కృషితో భారత్ ‘ఎ’ ఫైనల్లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి ముక్కోణపు సిరీస్ ట్రోఫీని ముద్దాడింది.

Next Story