- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Banks: బ్యాంకుల డిజిటల్ మాయాజాలానికి బ్రేక్
జూన్ 15న ఆర్‌బీఐ జారీ చేసిన సరికొత్త సవరణల ప్రకారం, బ్యాంకులు, వాటి ఏజెంట్లు కస్టమర్ల ప్రమేయం లేకుండా, వారిని భయపెట్టి లేదా గందరగోళపరిచి ప్రయోజనం పొందడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: మీరు బ్యాంక్ యాప్ ఓపెన్ చేయగానే లోన్ తీసుకోమంటూ విసిగించే పాప్-అప్‌లు, వద్దన్నా అకౌంట్‌లో యాడ్ అయిపోయే అనవసర ఇన్సూరెన్స్‌లు, క్రెడిట్ కార్డ్ రద్దు చేయాలంటే కనిపించకుండా దాచేసే ఆప్షన్లు.. ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురయ్యాయి. ఇప్పటివరకు ఇవి మార్కెటింగ్ ట్రిక్స్‌గా పరిగణించేవారు. ఇకపై ఇలాంటి పద్దతులు కుదరవు. డిజిటల్ బ్యాంకింగ్‌లో కస్టమర్లను తప్పుదోవ పట్టించే 'డార్క్ ప్యాటర్న్స్' (మోసపూరిత డిజైన్ల)కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గట్టి బ్రేక్ వేసింది. జూన్ 15న ఆర్‌బీఐ జారీ చేసిన సరికొత్త సవరణల ప్రకారం, బ్యాంకులు, వాటి ఏజెంట్లు కస్టమర్ల ప్రమేయం లేకుండా, వారిని భయపెట్టి లేదా గందరగోళపరిచి ప్రయోజనం పొందడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా 11 రకాల డిజిటల్ ట్రిక్కుల(డార్క్ ప్యాటర్న్స్)ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. బ్యాంకులు తమ యాప్స్, వెబ్‌సైట్లను ఆడిట్ చేసుకుని, ఈ మోసపూరిత డిజైన్లను తొలగించడానికి 2027, జనవరి 1 వరకు డెడ్‌లైన్ విధించింది. ఆ తర్వాత కూడా ఏ బ్యాంకైనా ఈ పద్ధతులు పాటిస్తే కస్టమర్లు నేరుగా ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
డార్క్ ప్యాటర్న్ అంటే?
వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ప్లాట్‌ఫామ్స్ రివ్యూలలో ఫేక్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఇవ్వడం, నెగెటివ్ రివ్యూలను కనబడకుండా చేయడం, సబ్‌స్క్రిప్షన్ ట్రాపింగ్, తప్పుడు ధరలతో ఆఫర్లు చూపించడం లాంటి వాటిని డార్క్ ప్యాటర్న్ అంటారు.
ఆర్‌బీఐ నిషేధించిన 11 డిజిటల్ ట్రిక్స్
ఫాల్స్ అర్జెన్సీ
'ఆఫర్ గడువు ముగుస్తుంది, వడ్డీ రేట్లు పెరిగిపోతాయి' అంటూ కృత్రిమ కౌంట్‌డౌన్ టైమర్లతో కస్టమర్లను కంగారు పెట్టి లోన్లు తీసుకునేలా ఒత్తిడి చేయకూడదు. ఆర్థిక నిర్ణయాలు తొందరపాటుతో కాకుండా, పూర్తి సమాచారంతో తీసుకోవాలని ఆర్‌బీఐ సూచిస్తోంది.
బాస్కెట్ స్నీకింగ్
కస్టమర్ అడగకుండానే లోన్ అప్లికేషన్ చివరలో ఇన్సూరెన్స్ లేదా అదనపు ఛార్జీల బాక్స్‌లను డిఫాల్ట్‌గా 'టిక్' చేసి ఉంచడం ఇకపై కుదరదు.
కన్ఫర్మ్ షేమింగ్
బ్యాంకులు తమ లాభాల కోసం కస్టమర్లను మానసికంగా ఇబ్బంది పెట్టి బలవంతంగా ఆఫర్లను ఓకే చేయించే 'కన్ఫర్మ్ షేమింగ్' ట్రిక్‌ను ఆర్‌బీఐ పూర్తిగా నిషేధించింది. ఇమెయిల్స్ వద్దనుకున్నా, సెక్యూరిటీ లేదా ప్రీమియం అప్‌గ్రేడ్‌లను తిరస్కరించినా.. 'నాకు ఆఫర్లు వద్దు, నేను నష్టపోవడానికే ఇష్టపడతాను' లేదా 'నా అకౌంట్‌కు సెక్యూరిటీ వద్దు' అంటూ కస్టమర్లలో అపరాధ భావన, భయం కలిగించేలా ఆప్షన్లు ఇకపై చెల్లవు. కొత్త రూల్ ప్రకారం, కస్టమర్ ఒక సర్వీస్ వద్దు అనుకుంటే ఆ బటన్ మీద ఎలాంటి సైకలాజికల్ గేమ్స్ లేకుండా సూటిగా 'వద్దు' లేదా 'డిక్లైన్ ' అని మాత్రమే ఉండాలి.
ఫోర్స్‌డ్ యాక్షన్
హోమ్ స్క్రీన్‌పై వచ్చే లోన్ యాడ్స్ పాప్-అప్‌లను క్లిక్ చేస్తే తప్ప హోమ్ పేజీకి వెళ్లకుండా ఇబ్బంది పెట్టడం, లేదా అవసరం లేకపోయినా కాంటాక్ట్స్, కెమెరా యాక్సెస్ అడగడం నిషేధం.
సబ్‌స్క్రిప్షన్ ఉచ్చు
క్రెడిట్ కార్డ్ లేదా ఇన్సూరెన్స్ కోసం సైన్ అప్ చేయడం ఎంత సులభమో, దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా అంతే సులభంగా ఉండాలి. క్యాన్సిలేషన్ ఆప్షన్ విషయంలో లేనిపోని క్లిక్స్ ఉండకూడదు.
ఇంటర్‌ఫేస్ జోక్యం
బ్యాంకుకు లాభం వచ్చే ఆప్షన్‌ను (ఉదాహరణకు: యాక్సెప్ట్ ఆల్) పెద్దగా ఆకుపచ్చ రంగులో చూపిస్తూ, కస్టమర్ వద్దనుకునే ఆప్షన్‌ను (డిక్లైన్) చిన్నగా, బూడిద రంగులో దాచడం లాంటి రూల్స్ ఉల్లంఘనే అవుతుంది.
బైట్ అండ్ స్విచ్(ఎర వేసి మోసం చేయడం)
యాడ్‌లో తక్కువ వడ్డీ రేటు లేదా 'లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్' అని ఆశ చూపి, తీరా అప్లై చేశాక కండిషన్స్ అప్లై అంటూ ఎక్కువ వడ్డీ లేదా హిడెన్ ఛార్జీలు వసూలు చేయకూడదు.
డ్రిప్ ప్రైసింగ్
లోన్ ప్రాసెస్ అంతా అయిపోయాక, చివరి చెక్అవుట్ స్టేజ్‌లో అప్పటివరకు చెప్పని సర్వీస్ ఛార్జీలు, కొత్త ప్రాసెసింగ్ ఫీజులను దొంగచాటుగా యాడ్ చేయడాన్ని ఆర్‌బీఐ బ్యాన్ చేసింది.
మోసపూరిత యాడ్స్
మీ అకౌంట్లో ఏదో అర్జెంట్ సమస్య ఉన్నట్లు పుష్ నోటిఫికేషన్ పంపి, దాన్ని క్లిక్ చేస్తే పర్సనల్ లోన్ యాడ్ చూపించే జిమ్మిక్కులు ఇకపై చెల్లవు.
వేధించడం
ఒక ఆఫర్ లేదా అదనపు ఫీచర్ కస్టమర్ వద్దని ఒకసారి తిరస్కరించిన తర్వాత, యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ అదే ఆప్షన్‌ను పదేపదే చూపిస్తూ విసిగించకూడదు.
మోసపూరిత భాష
'మీరు ఆఫర్లు వద్దనుకోకపోతే ఈ బాక్స్ అన్‌చెక్ చేయండి' వంటి కన్ఫ్యూజ్ చేసే డబుల్ నెగెటివ్ భాషను వాడకూడదు. భాష స్పష్టంగా, సూటిగా ఉండాలి.
బ్యాంకులు ఏమి చేయాలి?
ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం, అన్ని బ్యాంకులు తమ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, డిజిటల్ ప్రక్రియలను సమీక్షించాలి. డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు ఆడిట్‌లు నిర్వహించాలి. అలాగే, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) జారీ చేసిన 2023 డార్క్ ప్యాటర్న్స్ మార్గదర్శకాలను కూడా పాటించాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే?
2027, జనవరి 1 తర్వాత కూడా మీ బ్యాంకు ఇలాంటి పద్ధతులు కొనసాగిస్తే, ముందుగా బ్యాంక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. పరిష్కారం లభించకపోతే ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు.
డిజిటల్ బ్యాంకింగ్ వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో, వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేసే డిజైన్ ఎత్తుగడలపై ఆర్‌బీఐ మొదటిసారి స్పష్టమైన గీత గీసింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, బ్యాంకింగ్ యాప్‌లు మరింత పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.






