AI: ఏఐ టాలెంట్‌కు కొత్త కేంద్రంగా భారత్

by S Gopi |

అమెరికా, బ్రిటన్‌లతో కలిసి ఏఐ ప్రొఫెషనల్స్‌కు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానాల జాబితాలో టాప్-3లో చోటు దక్కించుకుంది.

AI: ఏఐ టాలెంట్‌కు కొత్త కేంద్రంగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తాజా అధ్యయనం ప్రకారం, 2025లో ప్రపంచవ్యాప్తంగా ఏఐ టాలెంట్‌ను ఆకర్షించడంలో భారత్ అత్యంత వేగంగా ఎదిగిన దేశంగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచ ఏఐ టాలెంట్‌లో సుమారు 6 శాతం వాటాను కలిగి ఉన్న భారత్, అమెరికా, బ్రిటన్‌లతో కలిసి ఏఐ ప్రొఫెషనల్స్‌కు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానాల జాబితాలో టాప్-3లో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది మాత్రమే భారత్ తన ఏఐ టాలెంట్ వాటాను 1.3 శాతం పాయింట్లు పెంచుకోవడం విశేషం. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) ప్రొఫెషనల్స్ విషయంలో కూడా దాదాపు 7 శాతం వాటాతో ప్రపంచ అగ్రగామి కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ వలసలు తగ్గుతున్న సమయంలో భారత్ ఈ పురోగతి సాధించడం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

బీసీజీ విశ్లేషణ ప్రకారం, విదేశాలకు వెళ్లిన నైపుణ్యం కలిగిన ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) ఇప్పుడు దేశంలో పెరుగుతున్న అవకాశాలను చూసి తిరిగి 'స్వదేశానికి' వచ్చేస్తుండటంతో అన్ని విభాగాల్లోనూ భారత్ తన వాటాను పెంచుకుంది. దేశీయ టెక్ ఎకోసిస్టమ్ విస్తరించడం, ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు పెరగడం ఈ ధోరణికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనివల్ల అటు రీసెర్చ్ విభాగంలో 0.3 శాతం, ఇటు స్టెమ్ విభాగంలో 0.7 శాతం చొప్పున భారత్ తన ప్రతిభావంతుల సంఖ్యను పటిష్టం చేసుకుంది. ఒక సాంకేతికతలో టాలెంట్ ఎక్కువగా ఉన్న దేశాలే భవిష్యత్తులో ఆ టెక్నాలజీ మార్కెట్‌ను శాసించే అవకాశం 17 రెట్లు ఎక్కువగా ఉంటుందని బీసీజీ స్పష్టం చేసింది. ప్రస్తుతం టెక్ విభాగంలో అమెరికా లీడింగ్‌లో ఉన్నప్పటికీ, ఏఐ టాలెంట్ విషయంలో భారత్ చూపిస్తున్న ఈ దూకుడు రాబోయే దశాబ్దపు ప్రపంచ టెక్నాలజీ యుద్ధంలో గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Next Story