రంగపేటలో సర్పంచ్ ‘టేకు’ భాగోతం.. ఫారెస్ట్ అధికారుల మెరుపు దాడి !

by Batti.Sumithra |

నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఏమవుతుందో రంగపేట ఘటన నిరూపించింది.

రంగపేటలో సర్పంచ్ ‘టేకు’ భాగోతం.. ఫారెస్ట్ అధికారుల మెరుపు దాడి !
X

దిశ, మానకొండూరు : నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఏమవుతుందో రంగపేట ఘటన నిరూపించింది. అధికార అహంకారంతో నాకెదురేంటి అనే ధోరణితో వ్యవహరించిన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన అధికార పార్టీ సర్పంచ్, టేకు కలపను అక్రమంగా తరలిస్తుండగా ఫారెస్ట్ అధికారులకు అడ్డంగా చిక్కాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పక్కా ప్రణాళికతో దాడి చేసిన అటవీశాఖ..

హుజూరాబాద్ రేంజ్ స్పెషల్ ఫారెస్ట్ బీట్ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఈ ఆపరేషన్‌ను పక్కాప్రణాళికతో నిర్వహించారు. సర్పంచ్ స్వయంగా టేకు కలపను ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్నాడనే సమాచారంతో సుమారు ఆరుగురు సిబ్బందితో కలిసి అధికారులు రంగంలోకి దిగారు. శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మానకొండూరు పోలీసుల సహకారంతో అక్రమ రవాణా జరుగుతున్న ట్రాక్టర్‌తో పాటు భారీ టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు.

మధ్యరాత్రి హైడ్రామా..

పట్టుబడిన టేకు కలపను, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని తరలించేందుకు అధికారులకు చాలా సమయం పట్టింది. గ్రామానికి నాయకత్వం వహించాల్సిన సర్పంచ్ ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. వాల్టా (WALTA) చట్టాన్ని ఉల్లంఘిస్తూ పర్యావరణానికి హాని కలిగించే విధంగా వ్యవహరించడం పై గ్రామంలో తీవ్ర చర్చ సాగుతోంది.

కేసు నమోదు

స్వాధీనం చేసుకున్న టేకు కలపను, ట్రాక్టర్‌ను కరీంనగర్ ఫారెస్ట్ కార్యాలయానికి తరలించిన అధికారులు కేసు నమోదు చేశారు. ఆదివారం కార్యాలయానికి సెలవు దినం కావడంతో, సోమవారం పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

గ్రామస్థుల ఆగ్రహం..

చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధే అధికార అహంకారంతో అక్రమాలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగితే సహించబోమని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపిస్తూ ధైర్యంగా చర్యలు తీసుకున్న ఫారెస్ట్ అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు.

Next Story