Gen Z: ట్రావెల్ రూల్స్ మార్చేస్తున్న జెన్ జీ

by S Gopi |

ఇప్పటి తరం యువత లాంగ్ టూర్ల కంటే.. ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవ్వడానికి వీకెండ్ ప్లాన్స్ లేదా చిన్న చిన్న విహారయాత్రలకే జై కొడుతున్నారు.

Gen Z: ట్రావెల్ రూల్స్ మార్చేస్తున్న జెన్ జీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏడాది పొడవునా కష్టపడి, పక్కాగా ప్లాన్ చేసుకుని, సంవత్సరానికి ఒకే ఒక పెద్ద లాంగ్ ట్రిప్ వేసే పాతకాలపు ట్రావెల్ పద్ధతులకు భారతీయ జెన్ జీ తరం నిశ్శబ్దంగా చరమగీతం పాడుతోంది. ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ 'ఎయిర్‌బీఎన్‌బీ' దేశంలోని 11 ప్రధాన నగరాల్లో జరిపిన తాజా సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి తరం యువత లాంగ్ టూర్ల కంటే.. ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవ్వడానికి వీకెండ్ ప్లాన్స్ లేదా చిన్న చిన్న విహారయాత్రలకే జై కొడుతున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఏకంగా 87 శాతం మంది యువత వారం లోపు ముగిసిపోయే షార్ట్ ట్రిప్స్‌కే మొగ్గు చూపుతున్నారు. ఒకే ఒక పెద్ద ట్రిప్ కంటే, ఏడాదిలో 3 చిన్న చిన్న పర్యటనలు చేయడానికి 70 శాతం మంది ఇష్టపడుతున్నారు.

నెలల ముందే బుకింగ్స్ కాలం చెల్లిపోయింది!

ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే మూడు నెలల ముందే రైలు, ఫ్లైట్ టికెట్లు, హోటళ్లు బుక్ చేసుకునేవారు. కానీ, జెన్ జీ డిక్షనరీలో ఆ పద్ధతే లేదు. 66 శాతం మంది కస్టమర్లు తమ ప్రయాణాన్ని కేవలం కొన్ని రోజుల ముందో లేదా ఒక వారం ముందో మాత్రమే బుక్ చేసుకుంటున్నారు. అంతేకాదు, రొటీన్‌కు భిన్నంగా తాము చేసే ఏ రెండు ప్రయాణాలు కూడా ఒకేలా ఉండకూడదని 67 శాతం మంది కోరుకుంటున్నారు.

ప్లాన్ లేకపోవడమే ప్లాన్

ఈ నివేదిక నేటి తరాన్ని 'యాంటీ-ఇటినరీ' (రూట్ మ్యాప్ లేని) తరం అని పిలుస్తోంది. వీరు ఒక టైమ్ టేబుల్ ప్రకారం ప్రదేశాలను చూడటానికి ఇష్టపడరు. 95 శాతం మంది తమ ట్రిప్ చాలా పర్సనల్‌గా, యూనిక్‌గా ఉండాలనుకుంటున్నారు. ఇందుకోసం 64 శాతం మంది యువత కొత్త ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్ చేయడానికి వీలుగా తమ ప్లాన్స్‌లో కొన్ని భాగాలను ఉద్దేశపూర్వకంగా ఖాళీగా (ఎలాంటి ప్లాన్ లేకుండా) వదిలేస్తారు. అన్నింటికంటే విచిత్రం ఏంటంటే.. ప్రతి ముగ్గురిలో ఇద్దరు కస్టమర్లు అసలు చూడదగ్గ ప్రదేశాలు చూడకుండా, తప్పక చేయాల్సిన పనుల లిస్ట్ ఏదీ పెట్టుకోకుండా, కేవలం ఒక చోట కూర్చుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికే ట్రిప్స్ వేస్తున్నారు.

డెస్టినేషన్ ముఖ్యం కాదు

జెన్ జీకి ప్రయాణం అనేది కేవలం తిరగడం కాదు, వారి వ్యక్తిత్వాన్ని చాటుకునే ఒక సాధనంగా మారుతోంది. తాము ఎంచుకునే డెస్టినేషన్ తమ అభిరుచికి తగ్గట్టుగా ఉండాలని 92 శాతం మంది చెప్తున్నారు. వీరికి టూరిస్ట్ స్పాట్స్ కంటే లోకల్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో తిరగడమే ఎక్కువ ఇష్టం (80 శాతం). అందుకే వీరికి 'బస చేసే ప్రదేశమే మెయిన్ డెస్టినేషన్‌గా' మారిపోయింది. 82 శాతం మంది తమ ట్రిప్‌లో వసతికే అత్యంత ప్రాధాన్యత ఇస్తుండగా, 78 శాతం మంది యువత తమ ట్రిప్ టైమ్‌లో సగానికి పైగా సమయాన్ని రూమ్‌లోనే గడుపుతున్నారు. వీరు కోరుకునేది లగ్జరీ హోటల్ రూమ్స్ కాదు.. చక్కని బాల్కనీ, లోకల్ మార్కెట్లకు దగ్గరగా ఉండటం, స్నేహితులంతా కలిసి ముచ్చటించుకోవడానికి వీలుగా ఉండే ఒక హోమ్లీ కామన్ లివింగ్ ఏరియా మాత్రమే.

Next Story